సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేసి, టిక్కెట్ దక్కని అనేకమంది తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ అందుకు భిన్నంగా టిక్కెట్లు కేటాయించారని, టీడీపీ డైరెక్షన్‌లోనే అభ్యర్థులను ప్రకటించారని, చంద్రబాబుకు మేలు చేసేందుకు తమకు అన్యాయం చేస్తారా? అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈమాత్రం దానికి నీతులు వల్లించడం దేనికని నిలదీస్తున్నారు. మొన్నటికి మొన్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ బాహాటంగానే జనసేనపై విరుచుకుపడ్డారు. టీడీపీకి సపోర్ట్‌గా జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్ నిలిచాయని, ఈ నాలుగు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయని అనుకుంటున్నారేమో కానీ ఆ నాలుగూ ఒక్కటేనని అన్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి టీడీపీతో లాలూచీ పడటం లేదని పవన్ కల్యాణ్ ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. మరోవైపు జనసేనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ నేతలు కూడా అదేరకంగా ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి లోపాయికారీగా సాయం చేసేందుకు, వైఎస్సార్ సీపీ ఓట్లు చీల్చేందుకు, జగన్‌ను బలహీనపరిచేందుకు తప్ప బీఎస్పీతో చేసుకున్న పొత్తులో పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి లేదని, లోపాయికారీగా టీడీపీతో పొత్తు పెట్టుకుని పని చేస్తున్నారని, బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా మాయ చేశారని జనసేన అధినేతపై బాహాటంగానే మండిపడుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నివైపులా తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా నమ్ముకున్న నాయకులను, పొత్తు పెట్టుకున్న పార్టీలను మోసం చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
చీకటి ఒప్పందాలా?
జనసేన సీట్లు చిరంజీవి ఇచ్చారా లేక టీడీపీ చెబితే ఇచ్చారా? నాకు చీకటి ఒప్పందాలు, రాత్రి రాజకీయాలు చేతకావు. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ప్రాధాన్యతనిస్తారనుకున్నాను. కనీసం వేరొకరికి టిక్కెట్ కేటాయించినప్పటికీ అతనికి సహకరించాలని కూడా జనసేన నుంచి ఏ ఒక్కరూ చెప్పకపోవడం అవమానకరంగా భావిస్తున్నాను. చిరంజీవి సూచనతోనే జనసేన పార్టీలో చేరాను. ప్రతి మీటింగులో తన అన్న చిరంజీవికి అన్యాయం జరిగిందని పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. ఆయన ఆవేదన నిజం కాదా? చివరి వరకూ ప్రయాణం చేసినందుకే నాకు టిక్కెట్ రాలేదా? విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటున్న పవన్ కల్యాణ్.. అభ్యర్థులను ఎలా ప్రకటించారో గుండెల మీద చేయి వేసి ఆలోచించుకోవాలి. ఆయన అవమానించిన తీరును దృష్టిలో ఉంచుకుని జనసేనకు రాజీనామా చేస్తున్నాను.
– పంతం గాంధీమోహన్, జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే, పెద్దాపురం
పవన్ కల్యాణ్ మాటలు నమ్మొద్దు
కష్టపడి పనిచేసే కొత్తతరం నాయకులను గుర్తించి సీట్లిస్తామని, మాజీలను పార్టీలో చేర్చుకోబోమని పవన్ కల్యాణ్ పదేపదే బహిరంగ సభల్లో చెప్పారు. దళిత మహిళనైన నేను పవన్ కల్యాణ్‌ను నమ్మి జనసేనలో చేరాను. ఏడాది కాలంగా పి.గన్నవరం నియోజకవర్గంలో సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ పటిష్టతకు పాటుపడ్డాను. వేలాది మంది ఎస్సీ, బీసీలను పార్టీలోకి తీసుకువచ్చి బలోపేతం చేశాను. నేను పార్టీకోసం ఎంత కష్టపడ్డానో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. జనసేనలో కష్టపడి పని చేసేవారికి గుర్తింపు లేదు. నిజాయితీ లేదు. డబ్బున్న వారికే టిక్కెట్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ నన్ను, నా కుటుంబాన్ని నట్టేట ముంచారు. ఆయనకు మహిళలంటే గౌరవం లేదు. మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అతని మాటలను ఎవ్వరూ నమ్మొద్దు.
– జనసేన పి.గన్నవరం నియోజకవర్గ నాయకురాలు యన్నపు లలిత కన్నీటి వేదనిది
Comments
Please login to add a commentAdd a comment