
గతంలో ఎస్‌ఎస్‌సీ నిర్వహించిన జేఈ ప్రశ్నపత్రం.. ఇందులోని ప్రశ్నలే జూనియర్ ట్రైన్ పరీక్షలోనూ ఇచ్చారు.
పరీక్ష ఏదైనా.. ఈ కాలంలో కాపీలు, మాస్ కాపీలు, స్లిప్పులు సర్వసాధారణమయ్యాయి. అటువంటి ఉదంతాలు వెలుగు చూసినప్పుడు కేసులు.. విచారణలు.. తప్పదనుకుంటే పరీక్షలురద్దు చేయడమూ కొత్తేం కాదు..కానీ సమాధానాల సంగతటుంచితే.. ప్రశ్నపత్రాన్నే కాపీ కొట్టేయడం ఇప్పటివరకు ఎక్కడా వినుండం..అదేమిటి.. ప్రశ్నపత్రాన్ని ఎవరు కాపీ కొడతారు?.. అని ఆశ్చర్యపోతున్నారా.. దానివల్ల ఎవరికి ఉపయోగం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయా??..ప్రశ్నపత్రాన్ని కాపీ కొట్టడం నిజం.. గత ఐదు రోజులుగాజరిపిన స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పరీక్షల్లో ఈ విడ్డూరంచోటు చేసుకుంది.ప్రశ్నపత్రాల తయారీని తలకెత్తుకున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలనే మక్కీకి మక్కీకి దించేసి ప్రశ్నపత్రాన్ని తయారు చేసేసింది.స్టీల్‌ప్లాంట్ రిక్రూట్‌మెంట్ అధికారులు దాన్నిపరిశీలించకుండానే.. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న జూనియర్‌ట్రైనీ పరీక్షలకు ఉపయోగించారు.ఈ పరిణామంతో పరీక్షలు రాసిన వేలాది అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నియామకాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట్లో పేపర్ లీకేజీలు, ఆ తర్వాత కోర్టు కేసులు, ఇప్పుడు మక్కా మక్కీ ప్రశ్నలు దించేశారన్న ఆరోపణలు. ఇలా చోటుచేసుకుంటున్న వరుస పరిణామలు స్టీల్‌ప్లాంట్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఉద్యోగార్థుల ఆశలు గల్లంతు చేస్తున్నాయి. 850 జూనియర్ ట్రైనీ పోస్టుల భర్తీకి స్టీల్‌ప్లాంట్ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టులకు సుమారు 65 వేల మందిఅభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ ఈనెల 9 నుంచి 14 వరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు.
అవే ప్రశ్నలు.. ఇక్కడా..!
ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రశ్నసత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్లాంట్ యాజమాన్యం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తుంటుంది. జూనియర్ ట్రైనీ పరీక్షల విషయంలోనూ అదే చేసింది. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతను తలకెత్తుకున్న ప్రైవేట్ సంస్థ దాని కోసం ఎందుకు శ్రమపడాలనుకుందో ఏమో గానీ.. 2016, 2017 సంవత్సరాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన జూనియర్ ఇంజినీర్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను చాలావరకు కాపీ కొట్టేసి స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ ప్రశ్నపత్రాలు తయారు చేసింది. ఆఫ్‌లైన్‌లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాలు చూసిన చాలామంది జూనియర్ ట్రైనీ ప్రశ్నపత్రంలో కనిపించాయని ఆరోపిస్తున్నారు.
అవేంటంటే..
ఎస్.ఎస్.సి. 2016లో నిర్వహించిన జేఈ మెకానికల్ పరీక్ష సెట్–4ను ఈ నెల 9న ఉదయం జరిగిన స్టీల్‌ప్లాంట్ జేటి పరీక్షలో, సెట్–2ను అదే రోజు మధ్యాహ్నం పరీక్షలో, సెట్–3ని మే 12 ఉదయం పరీక్షలో, సెట్–6ను ఆరోజు మధ్యాహ్నం పరీక్షలో దాదాపు మక్కీకి మక్కీగా ఇచ్చేశారు. అదే విధంగా 2017 మార్చి 3న నిర్వహించిన ఎస్‌ఎస్‌సి పరీక్ష పేపర్‌ను సోమవారం(ఈ నెల 14) మధ్యాహ్నం పరీక్షలో యథాతథంగా దించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఐటీఐ అభ్యర్థులకు బీఈ ప్రశ్నలా..
ఐటిఐ అర్హతతో నిర్వహించిన జూనియర్ ట్రైనీ పరీక్షకు జూనియర్ ఇంజనీర్(బీఈ) స్థాయిలో ఇవ్వడమేంటని అభ్యర్థులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్టీల్ ప్లాంట్ సీఐటీయూ నాయకులు ప్లాంట్ నియామకాల విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఎస్.ఎస్.సి ప్రశ్నపత్రాలు, స్టీల్‌ప్లాంట్ ప్రశ్న పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఉత్పత్తికి తగ్గట్టు సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న ప్లాంట్‌లో ఈ పరిణామాలు నియామకాల్లో మరింత జాప్యం జరిగి నష్టం వాటిల్లుతుందంటున్నారు.
యాజమాన్యంఅసమర్థత వల్లే
యాజమాన్యం అసమర్థత, అలక్ష్యం వల్ల నియామకాల ప్రక్రియలో వరుసగా తప్పులు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే వీటన్నింటికీ కారణం. ఇలాగైతే ప్లాంట్ ఉత్పత్తికి మరిన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వెంటనే యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం – కె.ఎం. శ్రీనివాస్,స్టీల్ సీఐటీయూ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment