విభజనకు దారి చూపిన బాబు, కిరణ్: భూమన
హైదరాబాద్: చంద్రబాబు, కిరణ్ సమైక్య ముసుగులో ఉన్న ద్రోహులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చింది సీఎం కిరణేనని ఆరోపించారు. ఊసరవెల్లిగా రంగులు మార్చే వ్యక్తి కిరణ్ అని దుయ్యబట్టారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు ఏనాడైనా సమైక్య మన్న మాట అన్నారా అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి ఆయన తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కిరణ్ గబ్బిలంలా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు మొదటి ద్రోహి సీఎం కిరణ్ అన్నారు. కోర్‌కమిటీలో గంగిరెద్దులా తల ఊపారని చెప్పారు. పదవి కోసం సీఎం, పార్టీ కోసం చంద్రబాబు విభజనకు దారి చూపారన్నారు. విభజన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో చార్రిత్రాత్మక పాత్ర పోషించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. సమైక్యరాష్ట్రం కోసం నాలుగు నెలలుగా లక్షలాది మంది కార్యకర్తలు విరోచితంగా పోరాడారని భూమన తెలిపారు.