ప్రేమతో మనుగడ సాగించాలి: వైఎస్ షర్మిల
క్రీస్తును విశ్వసించిన వారికి కష్టాలు దూరం
బైబిలు మిషన్ మహాసభల్లో వైఎస్ షర్మిల
సాక్షి, గుంటూరు: మనిషిని దేవుడు ఎంతో ప్రేమగా పుట్టించాడనీ, అంతే ప్రేమగా ఆయనపై ప్రేమ, సమానత్వంతో మనుగడ సాగించాలని వైఎస్ షర్మిల అన్నారు. ప్రతి ఒక్కరూ పాపం నుంచి విముక్తిని పొందాలనీ, అప్పుడే దేవుడైన క్రీస్తును సులభంగా చేరగలమన్నారు. గుంటూరుకు సమీపంలోని నాగార్జుననగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రాష్ట్రస్థాయి 76వ బైబిలు మిషన్ మహా సభల్లో ముఖ్య అతిథిగా షర్మిల లక్షలాది మంది దైవజనులనుద్దేశించి ప్రసంగించారు. నీతిమంతుడైన దేవుడు పాపులను పరిరక్షించి వారికి అన్ని విధాలా రక్షణ కలిగించేందుకే భువిపైకి వచ్చారన్నారు. మనుషుల్లో పెరిగిన పాప ప్రక్షాళన కోసం క్రీస్తు పడిన కష్టాలు ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించాయన్నారు. ‘వైఎస్ కుటుంబం కోసం, జగనన్న విడుదలకు బైబిలు మిషన్ మహాసభల్లో ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వారందరికీ రాజన్న కుటుంబం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తోంద’ని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ పేరును ప్రస్తావించిన ప్రతిసారీ కరతాళధ్వనులు మిన్నంటాయి.
ఆకట్టుకున్న బ్రదర్ అనిల్ వాక్యోపదేశం: బ్రదర్ అనిల్‌కుమార్ అందించిన క్రీస్తు వాక్యోపదేశాన్ని దైవజనులు ఆసక్తిగా ఆలకించారు. దేవుని స్తుతి గేయాలు, ప్రార్థనలతో ఈ వాక్యోపదేశం గంటన్నరసేపు సాగింది. అనంతరం బైబిలు మిషన్ నిర్వాహకులు రెవరెండ్ శామ్యూల్ కిరణ్, ఏసురత్నం, సత్యానందం తదితరులు వైఎస్ షర్మిల, వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఆశీర్వాదాలు అందజేశారు.