జిల్లాలో భూ ప్రకంపనలు | Nepal earthquake: Hundreds die, many feared trapped | Sakshi
Sakshi News home page

జిల్లాలో భూ ప్రకంపనలు

Published Sun, Apr 26 2015 3:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM

Nepal earthquake: Hundreds die, many feared trapped

11.47 గంటలకు కొన్ని ప్రాంతాల్లో..
  11.50 గంటలకు ఇంకొన్ని ప్రాంతాల్లో..
  భయంతో పరుగులు తీసిన ప్రజలు
  ఖాట్మండులో జిల్లా వాసులు క్షేమం
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నేపాల్ ప్రాంతంలో సంభవిం చిన తీవ్ర భూకంప ప్రభావం శ్రీకాకుళం జిల్లాపైనా పడింది. శనివారం ఉదయం 11.47 గంటల ప్రాంతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు కనిపించాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లలో భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. శ్రీకాకుళం పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. నరసన్నపేట నియోజకవర్గంలోని జలుమూరు, పోలాకి, ఉర్లాం, ఖండాం, చెన్నాపురం, పారశెల్లి గ్రామాలు, పోలాకి, పలాస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట తదితర మండలాల్లో 11.47 గంటల సమయంలో సుమారు రెండు నిమిషాలపాటు భూమి కంపించిందని ఆయా ప్రాంతాల ప్రజలు తెలిపారు. కాగా పలాస పట్టణంలోని శ్రీనివాసనగర్‌తో పాటు ఉద్దానంలోని పలు ప్రాంతాల్లో 11.50 గంటల సమయంలోనూ కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఇళ్లలో సామాన్లు, నేల ఒక్కసారిగా కదిలినట్లు అనిపించిందని పలువురు పేర్కొన్నారు. అయితే ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కాగా, శ్రీకాకుళానికి చెందిన కొంతమంది ఖాట్మండులోని భూ కంప ప్రాంతంలో చిక్కుకున్నారని వార్తలు వచ్చాయి.
 
 ఖాట్మండ్‌లో జిల్లావాసులు క్షేమం
 నరసన్నపేట, శ్రీకాకుళం: భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌లోని ఖాట్మండు ప్రాంతంలో 11 మంది శ్రీకాకుళం జిల్లావాసులు చిక్కుకున్నట్లు తెలియడంతో మొదట ఆందోళన వ్యక్తమైనా తర్వాత వారంతా సురక్షితంగా ఉన్నారని తెలియడంతో వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని నరసన్నపేట, ఆమదాలవలస, పాలకొండ ప్రాంతాలకు చెందిన 11 మంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసులతో కలిసి పది రోజుల క్రితం ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా నేపాల్ యాత్రకు వెళ్లారు. భూకంపం సంభవించినప్పుడు వారు అక్కడే ఉన్నట్లు తెలియడంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే తామంతా సురక్షితంగా ఉన్నామని శనివారం రాత్రి వారిలో కొందరు తమ కుటుంబ సభ్యులకు ఫోను ద్వారా తెలియజేశారు. అయితే వర్షాలు, వరదల కారణంగా తిరిగి రావడానికి మరో మూడు నాలుగు రోజులు పడుతుందని చెప్పారు. నరసన్నపేట మండలం ఆదివరపుప్పేటకు చెందిన కొత్తకోట పార్వతీశం ఖాట్మండ్ నుంచి సురక్షితంగా తిరుగు ప్రయాణమైనట్లు తన కుమారుడు కోటికి ఫోను ద్వారా తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఖాట్మండ్‌లో ఉండగా భూకంపం వచ్చిందని, తనతో పాటు మరో 10 మంది ఉన్నట్లు తన తండ్రి చెప్పారని కోటి తెలిపారు. అయితే జిల్లా అధికారులు వీటిని కొట్టివేశారు. దీనిపై తమకెలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement