
వరి ‘మద్దతు’లో దగా...
- పంజాబ్, హర్యానాకు మేలు.. ఆంధ్రాకు చేటు
- పాలకుల నిర్లక్ష్యం
- రాష్ట్రాల వారీగా ప్రకటించాలని జగన్ డిమాండ్
- వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి
సాక్షి, మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం కారణంగా వరికి మద్దతు ధర విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదాత అడుగడుగునా మోసానికి గురవుతున్నాడని, అందుకే రాష్ట్రాల ప్రాతిపదికగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.
వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) క్వింటాల్‌కు రూ.50పెంచుతూ కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదించడం వరి రైతును దగా చేయడమేనని నాగిరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెస్పీగా 2014-15లో సాధారణ రకం ధాన్నం క్వింటాల్‌కు రూ.1,360 ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,400 మాత్రమే ధర నిర్ణయించడం మోసం చేయడమేనని నాగిరెడ్డి శుక్రవారం సాక్షితో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రైతులు వరి, పత్తి పండిస్తారని, అయితే ఈ ఏడాది వరి రైతులకు ముష్టి వేసినట్టు కేవలం రూ.50 మాత్రమే పెంచడం దారుణమన్నారు. ఒక పంట ఉత్పత్తికి ఎంత ఖర్చవుతుంతో పరిశీలించి లాభసాటి ధర ఇవ్వాల్సి ఉందన్నారు. అదేమి పట్టించుకోకుండా కనీస మద్దతు ధర సక్రమంగా ఇవ్వలేని పాలకులు ఉన్నా దండగేనని నాగిరెడ్డి ధ్వజమెత్తారు.
ఒక ఉద్యోగికి డీఏ పెంచాలంటే మూడు నెలలుగా మార్కెట్‌లో పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటారని గుర్తుచేశారు.
అదే రైతుల విషయంలో కనీస మద్దతు ధర ఇచ్చేందుకు పెరిగిన పెట్టుబడులను ఎందుకు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరతో నాకు సంబంధంలేని, దానికి ఒక శాస్త్రీయ కమిటీ ఉందని గతంలో చెప్పిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ తరువాత ఆయనే స్వయంగా మద్దతు ధర ఎలా ప్రకటించారన్నారు. రైతుల పెట్టుబడుల భారాన్ని పరిగణనలోకి తీసుకోని పాలకుల తీరును వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని నాగిరెడ్డి చెప్పారు.
గిట్టుబాటు ధర కోసం జగన్ పోరాటం చేశారు...
మద్దతు ధర రైతుకు గిట్టుబాటుగా ఉండాలనే తమ పార్టీ మొదట్నుంచి పోరాటం చేస్తోందని, ఇందుకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహనరెడ్డి అనేక సందర్భాల్లో పోరాటం చేశారని నాగిరెడ్డి గుర్తు చేశారు. జగన్‌మోహనరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తుఫాన్‌లో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలంటూ మొట్ట మొదట 2011 డిసెంబర్‌లో విజయవాడలో లక్ష్యదీక్ష చేపట్టిన సంగతిని నాగిరెడ్డి ప్రస్తావించారు. జగన్‌మోహనరెడ్డి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా రైతుల కోసం దీక్ష చేశారని అన్నారు. అదే విధంగా 2012 డిసెంబర్‌లో పుట్టిన రోజున కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను కలిసి ధాన్యం ధర, ఎగుమతులపై చర్చించేందుకు జగన్‌మోహనరెడ్డి ప్రయత్నిస్తే కొందరు రాజకీయ కుట్రతో అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయించారని నాగిరెడ్డి అన్నారు.
పంజాబ్‌కు మేలు.. ఆంధ్రప్రదేశ్‌కు చేటు
కనీస మద్దతు ధర నిర్ణయంలో దేశమంతటా ఒకేలా పరిగణించి అంచనా వేయడంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మేలు కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌కు చేటు చేస్తున్నారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఒక క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి కేవలం రూ.4వేలు ఖర్చు అవుతుందని, అదే ఆంధ్రప్రదేశ్‌లో రూ.8వేలు అవుతుందని అన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్కడా ఇక్కడా ఇకే ధర ఇస్తామనే పద్ధతి సరికాదని అన్నారు.
దీని వల్ల పంజాబ్‌కు తక్కువ పెట్టుబడి కారణంగా ఎక్కువ లాభం వస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటంతో మద్దతు ధర సరిపోక నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రాల వారీగా మద్దతు ధర ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహనరెడ్డి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని నాగిరెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఊతమివ్వకుండా సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేస్తారని నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.