ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ భవనాలు
గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యనందించాలన్నసంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిమూడు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. అందులో ఒకటి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఒంగోలుకు మంజూరుచేసిన ట్రిపుల్ ఐటీ కూడా ఇడుపులపాయలోనే కొనసాగిస్తున్నారు.మూడేళ్లవుతున్నా దీనిని తరలించేందుకు చర్యలు తీసుకోలేదు.స్థలాన్ని సేకరించి తొమ్మిది నెలలు కావస్తోంది.శిలాఫలకం వేసి ఐదు నెలలయింది.అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేఅన్నట్లు గా తయారైంది పరిస్థితి.ఇబ్బందులు ఎదుర్కొంటూనే ట్రిపుల్‌ఐటీలలో విద్యార్థులు చదువులుకొనసాగిస్తున్నారు.
సాక్షి కడప/వేంపల్లె : ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ స్థాపించి దాదాపు పదేళ్లయింది. వైఎఎస్ హయాంలో దీని నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. టీడీపీ సర్కారు వచ్చాక వీటిని పట్టించుకోవడం మానేసిందనే విమర్శలున్నాయి. మూడేళ్ల క్రితం ఒంగోలుకు మంజూరు చేసిన ట్రిపుల్ ఐటీ కూడా ఇక్కడే కొనసాగిస్తున్నారు. దీని తరలింపును సర్కారు విస్మరించింది. రెండు ట్రిపుల్ ఐటీలలో 6 వేల మంది వంతున విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంఖ్యకు 450 నుండి 500 మంది ఫ్యాకల్టీ (అధ్యాపకులు) ఉండాలి. 150మంది మాత్రమే ఉన్నారు. ఫ్యాకల్టీ కొరత తీర్చడం లేదు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యను అందించడం కూడా ఉన్న ఫ్యాకల్టీ్టకి కష్టతరంగా మారుతోంది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. వసతులు అంతంతమాత్రమే. ఆహారం కూడా సరిగా లేదని విద్యార్థులు పలుమార్లు రోడ్డెక్కిన çసందర్భాలు ఉన్నాయి. యూనిఫాం, సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాంకేతిక సమస్యలు
ఉన్నతాశయంతో నెలకొల్పిన సాంకేతిక విద్య విషయంలో సర్కారు అలక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో వేసవికాలంలో విద్యార్థుల సంరక్షణ కరువైంది. నిబంధనల ప్రకారం విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లలో బోధన సాగించాలి. వాటిని ఎప్పుడు ఏసీలో ఉంచాలి. కానీ విద్యార్థులకు అక్కడ ఫ్యాన్లు, ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గతనెల 29 నుంచి పరీక్షలు జరుగుతుండటంతో వేడిని తట్టుకోలేక ఎప్పుడు పరీక్షలు అయిపోతాయా.. ఎప్పుడు ఇంటిదారి పడుతామా అంటూ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో నిర్వహణ చాలా అధ్వానంగా తయారైంది. వేసవి చివరి నాటి వరకు ఏసీలను మరమ్మత్తు చేయించలేదు. పరీక్షలు ముగియగానే విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఏసీల మరమ్మతు వ్యవహారంపై కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఐటీలలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒంగోలు ట్రిపుల్ ఐటీలో కొంతమందిని నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు లేకుండానే జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ట్రిపుల్ ఐటీలోని కొంతమంది ఉన్నతాధికారుల కనుసన్నల్లో పలువురిని నియమించుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. తమ అనుకూల వ్యక్తులకు అకడమిక్, ఎగ్జామినేషన్ తదితర కీలకమైన వాటిలో పోస్టులు భర్తీ చేశారని సమాచారం.
ఎటువంటి నియామకాలు జరగలేదు
ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఎటువంటి నియామకాలు జరపలేదు. ఎవరో గిట్టనివారు ఆరోపణలు చేస్తున్నారు. ఆర్జీయూకేటీ ఆదేశాల మేరకే ఉద్యోగ నియామకాలు చేపడతాం. వాస్తవానికి సిబ్బంది కొరత ఉంది. వచ్చే ఏడాదికల్లా సిబ్బంది, నియామకాలు జరపాలని ఆర్జీయూకేటీ అధికారులకు ప్రతిపాదనలు పంపాం. వారి ఆదేశాలకు అనుగుణంగా నియామకాలు చేపడతాం. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. – వెంకట్రావ్(ట్రిపుల్ ఐటీ డైరెక్టర్), ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment