నవ వసంతం... సంకల్పం | Promising to district | Sakshi
Sakshi News home page

నవ వసంతం... సంకల్పం

Published Thu, Dec 31 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

Promising to district

నవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా
జిల్లాకు ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ.. నేతలు,
అధికారులు తమ అభిమతాలను ఇలా వెలిబుచ్చారు.

 
పౌరసరఫరా వ్యవస్థను గాడిలో పెట్టగలిగాను గడిచిన 2015లో పౌరసరఫరాల వ్యవస్థను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టగలిగాను. రేషన్ షాపుల్లో ప్రవేశపెట్టిన ఈపాస్ విధానం విజయవంతమైంది. 20 శాతం మేర సరుకులను ఆదా చేయగలిగాం. లక్ష సీఎస్‌ఆర్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, 80వేలు ఇవ్వగలిగాం. 15వేల ఎంఐఎంబీ రికార్డులను అప్‌గ్రేడ్ చేశాం. 2016లో 1.15 లక్షల తెల్లకార్డులు జారీచేయనున్నాం. జీవో.296 ప్రకారం వంద గజాల్లోపు ప్రభుత్వ భూముల్లో క్రమబద్ధీకరణ కింద 50 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. త్వరలో వీరికి లీగల్ డాక్యుమెంట్స్ జారీ చేయనున్నాం. - జె.నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్
 
 
విశాఖదే ఉజ్వల భవిష్యత్

2016 విశాఖదే ఉజ్వల భవిష్యత్. జిల్లా ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు  పనిచేస్తాం. కొత్త సంవత్సరంలో విశాఖ అభివృద్ధిలో పరుగులు తీస్తోంది.
 - గంటా శ్రీనివాసరావు,
 రాష్ర్ట మానవ వనరుల
 శాఖ మంత్రి
 
అభివృద్ధిలో  ‘విశాఖ’ పరుగులు
హుద్‌హుద్ తుఫాన్‌ను ఎదురొడ్డి నిలిచిన విశాఖ గడిచిన 2015లో నిలదొక్కుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. 2015లో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, పరిశ్రమలకు అంకురార్పణ జరిగింది. 2016లో జనవరి 10,11,12 తేదీల్లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు, ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలకు విశాఖ వేదికవుతోంది. మరో జాతీయ విద్యా సంస్థ పెట్రో యూనివర్శిటీ కూడా కార్యరూపం దాల్చనుంది. రెండు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్, ఐటెక్స్ టవర్, ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చురింగ్, ఐటీ, లాజిస్టిక్, ప్యాకేజింగ్ పార్కులు రాబోతున్నాయి. పోలవరం ఎడమకాలువ పనులు ప్రారంభం కానున్నాయి.
 - డాక్టర్ ఎన్.యువరాజ్, జిల్లా కలెక్టర్    
 
 
 సంక్షేమ పథకాలను చేరువ చేయడమే లక్ష్యం
సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు చేరువ చేయడమే లక్ష్యం. బీసీ, ఎస్సీ, వికలాంగ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన యూనిట్స్ అన్నీ కార్యరూపం దాల్చేలా కృషి చేస్తా. ఈ పథకాల ద్వారా లబ్ధి పక్కదారి పట్టకుండా చూస్తా.
 - డి.వెంకటరెడ్డి,
 జేసీ-2  
 
 అరకు కాఫీని మార్కెటింగ్ చేస్తాం
 అరకు బ్రాండ్‌గా మార్కెట్‌లోకి తీసుకొస్తున్న కాఫీకి అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యం. జీసీసీని గాడిలో పెట్టి లాభాలబాట పట్టించేలా చేశాను. ప్రస్తుతం రూ.180 కోట్లుగా ఉన్న జీసీసీ టర్నోవర్‌ను పెంచేందుకు రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తున్నాం.
 -ఎ.ఎస్.పి.ఎస్. రవిప్రకాష్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, జీసీసీ
 
అభివృద్ధిలో పాలుపంచుకుంటా
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే సమయంలో కీలకమైన విశాఖ రెవెన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టా. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విశాఖకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విశాఖ అభివృద్ధిలో నేను భాగస్వామిని కాబోతున్నందుకు ఆనందంగా ఉంది.
 - సి.చంద్రశేఖరరెడ్డి, డీఆర్‌ఓ
 
జీవీఎంసీకి కొత్త ఏడాదిలో ఎన్నికలు
2015 ప్రారంభంలో జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. అప్పటి నుంచి పాలనలో పారదర్శక కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. స్మార్ట్‌సిటీకి విశాఖ ఎంపికైన తర్వాత చోటు లభించడమే కాదు. వచ్చే ఏడాదే ఇందుకు సంబంధించి పనులు ప్రారంభం కానున్నాయి. జనవరి 11 నుంచి ఈ ఆఫీస్ అమలులోకి తీసుకొస్తు న్నాం. ఇక నుంచి ఏ దరఖాస్తు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చే అవకాశం లేకుండా అంతా ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తున్నాం. కొత్త సంవత్సరంలో జీవీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తపాలకవర్గం కొలువుదీరితే మాపై ఒత్తిడి తగ్గుతుంది.  -ప్రవీణ్‌కుమార్, కమిషనర్, జీవీఎంసీ
 
 

Advertisement

పోల్

Advertisement