రైల్వే జీఎం పర్యటన | Railway General manger tour | Sakshi
Sakshi News home page

రైల్వే జీఎం పర్యటన

Published Sat, Jun 7 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

రైల్వే జీఎం పర్యటన

రైల్వే జీఎం పర్యటన

 సంగడిగుంట (గుంటూరు), న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం గుంటూరు రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ వరకూ రైల్లో వచ్చిన ఆయన రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. నంబూరు, మంగళగిరి రైల్వేస్టేషన్‌లను తనిఖీ చేశారు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో స్థానిక రైల్వేస్టేషన్లలోని వసతులు, పారిశుద్ధ్యంపై అధికారులకు సూచనలిచ్చారు.
 
 అనంతరం గుంటూరు రైల్వేస్టేషన్‌కు వచ్చి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలోని  ఏసీ వెయిటింగ్‌హాల్, రిజర్వేషన్ కౌంటర్, తాగునీటి ప్లాంట్‌ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లాట్‌ఫాంపై ఈగలు ఎక్కువగా ఉండటాన్ని గమనించి స్ప్రే, ఫ్లై కిల్లింగ్ మెషీన్లు తదితర నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవేశ హాలులో తేజస్వినీ స్క్వాడ్‌తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ెహ ల్ప్ డెస్క్ సిబ్బందికి సూచనలిచ్చారు. డీఆర్‌ఎం ఎన్‌కే ప్రసాద్ పార్కింగ్ వివరాలను జీఎం వివరించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా పోలీసు శాఖ అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే స్టేషన్‌లోకి అనుమతించాలని జీఎం ఆదేశించారు. వీఐపీ లాంజ్‌లో స్థానిక అధికారులతో పలు అంశాలపై చర్చించారు. స్టేషన్‌లో నాణ్యమైన ఆహార పదార్థాలు, చల్లని తాగునీరు, పరిశుభ్రత విషయంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించాలని స్టేషన్ సూపరింటెండెంట్‌కు సూచించారు. ప్రమాణ స్వీకారానికి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో టిక్కెట్ లేకుండా వచ్చే వారి వద్ద నుంచి జరిమానా లేకుండా టిక్కెట్ సొమ్మును మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.
 
 జీఎంను కలిసిన రావెల..
 రైల్వే కమర్షియల్ మాజీ మేనేజర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు జీఎంను కలిసి ప్రమాణ స్వీకారానికి రానున్న అభిమానుల గురించి వివరించారు. కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌కి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని, స్థానిక ఇతర శాఖలనుండి రావాల్సిన ఇతర అనుమతులు రాకపోవడంతో వినియోగంలోకి రాలేదని డీఆర్‌ఎం వివరించారు.
 
 స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఆర్‌యూబీ వినియోగంలోకి వచ్చే విధంగా సహకరించాలని రావెల కిషోర్‌ను కోరారు. అనంతరం ప్రత్యేక రైల్లో సికిందరాబాదు వెళ్లారు. జీఎం పర్యటనలో డీఆర్‌ఎం ఎన్‌కే ప్రసాద్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ, ఆర్పీఎఫ్ ఛీప్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్ పచేర్వాల్, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ రమేష్‌చంద్ర, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఎం.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement