4,322 మందిని రెగ్యులర్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు
ఆంధ్రాలో 2,327, తెలంగాణలో 1,995
త్వరలో మరో 4,000 మందిని రెగ్యులర్ చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్న 4,322 మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీలో 2,327 మంది, తెలంగాణలో 1,995 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ కార్మికులుగా గుర్తించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి క్రమబద్ధీకరించిన కార్మికుల్లో కండక్టర్లు 1,391 మంది, డ్రైవర్లు 2,931 మంది ఉన్నారు. ఏపీకి సంబంధించి 2,327 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరిలో కండక్టర్లు 615, డ్రైవర్లు 1,712 మంది ఉన్నారు. వీరంతా 2012 డిసెంబర్ 31కి ముందు కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. వీరి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్టీసీ ఎండీ జె.పూర్ణచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి వీరిని రెగ్యులర్ కార్మికులుగా గుర్తించనున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు నాలుగు దశల్లో 17,738 మందిని రెగ్యులర్ చేశారు. త్వరలో మరో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ కానున్నట్లు సమాచారం. గతేడాది జూలై 4న అప్పటి రవాణా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణతో యూనియన్ నేతలు జరిపిన చర్చల్లో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్న ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆ హామీ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 2013 మే 1, సెప్టెంబర్ 1, 2014 మే 1, సెప్టెంబర్ 1 తేదీల్లో నాలుగు దశల్లో కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ పూర్తయింది. ఈ క్రమబద్ధీకరణతో కాంట్రాక్టు కార్మికుల జీతం రెట్టింపుకానుంది. ఏపీకి సంబంధించి రెగ్యులర్ అయిన కాంట్రాక్టు కార్మికుల్లో అధికంగా కృష్ణా జిల్లాలో 500 మంది, గుంటూరు జిల్లాలో 407 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడం పట్ల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పద్మాకర్ హర్షం వెలిబుచ్చారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉపసంఘం: ఏపీఎన్జీవోలకు సీఎం హామీ
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అశోక్‌బాబు నేతృత్వంలోని ఏపీఎన్జీవోల ప్రతినిధి బృందం బుధవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో కలిసింది. ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాల జీవోను ఎన్జీవోల మనోభావాలకు అనుగుణంగా రూపొందించామని.. గురువారం జీవో వెలువడుతుందని సీఎం వారికి వివరించారు. కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన నాన్ గెజిటెడ్ అధికారులను బదిలీ చేయాలని.. ఉద్యోగుల మొత్తం బదిలీలు 20 శాతం మించకుండా ఉండాలని, పాత నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చామని సీఎం తెలిపారు. గుర్తింపు పొందిన సంఘాల్లో పనిచేస్తున్న అధ్యక్ష, కార్యదర్శులకు మినహాయింపు కొనసాగించనున్నామని సీఎం వెల్లడించారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు కూడా త్వరలో జారీ చేస్తామని హామీఇచ్చారు. ప్రతినిధి బృందంలో చంద్రశేఖరరెడ్డి, వీరేంద్రబాబు, వెంకటేశ్వరరెడ్డి తదితరలు ఉన్నారు.
ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ
Published Thu, Sep 4 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement