దువ్వూరు మండలం సంగటితిమ్మాయపల్లె వద్ద స్కూలు బస్సు బోల్తా పడింది. అధికారుల
ఆర్భాటం, ప్రైవేటు పాఠశాలల యజమానుల నిర్లక్ష్యంతో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. 40 మంది ప్రయాణించాల్సిన బస్సులో 120మంది చిన్నారులను కుక్కేశారు. పెద్దమట్టికుప్పపై బస్సు బోల్తా పడటంతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
దువ్వూరు: మండలపరధిలోని గుడిపాడులో ఉన్న శ్రీ గురుశంకరాచార్య పాఠశాల బస్సు బోల్తాపడింది. ఈ సంఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లే సమయంలో మండలంలోని సంగటిదిమ్మాయపల్లె వద్ద మలుపు తిరుగుతుండగా బస్సు వెనుభాగంలో ఉన్న చక్రాలు కల్వర్టులోకి జారుకున్నాయి. దీన్ని డ్రైవర్ గమనించలేదు. అలాగే వాహనాన్ని నడపడంతో ఒక్కసారిగా బస్సు వంకలోకి బోల్తాపడింది.
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 120 మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏడ్చారు. భీమునిపాడు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను బస్సులో నుండి బయటకు లాగారు. బస్సు అద్దాలు పగిలి నర్సరీ చదువుతున్న భాను, వైష్ణవి మరో విద్యార్థి గాయపడ్డారు.
కొత్త డ్రైవర్ కావడంతోనే:
బస్సుకు రెగ్యులర్ డ్రైవర్ రఫీ ఉండేవాడు. అతని తండ్రి మృతి చెందడంతో ఉదయం మాత్రమే పిల్లలను పాఠశాలకు చేర్చి ఆ తరువాత సెలవు పెట్టాడు. దీంతో కొత్తగా వచ్చిన డ్రైవర్ రామయ్య రహదారి తెలియకనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
మట్టి కుప్పతో తప్పిన పెను ప్రమాదం:
బస్సు కుడి వైపునకు వాలగానే పెద్ద మట్టికుప్పపై పడింది. దీంతో బస్సు పల్టీలు కొట్టకుండా ఆగింది. లేకుంటే ఏ మాత్రం బస్సు పల్టీలు కొట్టినా పక్కనే ఉన్న వంకలో పడి ఉండేది. విద్యార్థులకు ప్రమాదం వాటిల్లేదని తల్లిదండ్రులు వాపోయారు. 120 మంది విద్యార్థులను ఒక బస్సులో ఏవిధంగా ఎక్కించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళనకు గురైన తల్లిదండ్రులు
బస్సు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. హుటాహుటినా సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. పిల్లలను అందోళనతో ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకొన్న పాఠశాల నిర్వాహకులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటామని తెలిపారు.
స్కూల్ బస్సు బోల్తా
Published Thu, Aug 7 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement