చీడపీడలు | Seemingly crops Cotton, soy, variki loss | Sakshi
Sakshi News home page

చీడపీడలు

Published Mon, Oct 14 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

Seemingly crops Cotton, soy, variki loss

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :కర్షకులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్ ఆరంభంలో వర్షాల జాడలేక, విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయారు. జూలైలో పక్షం రోజులపాటు కురిసిన వర్షాలు 39 మండలాల్లోని పంటలపై ప్రభావం పడింది. దాదాపు 1.10 లక్షల మంది రైతులు 66 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రూ.61 కోట్ల విలువైన పంటలు నష్టపోయారు. అధికంగా పత్తి రైతులు నష్టం చవిచూశారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావడం, వర్షాలు కురుస్తుండటంతో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గుతోంది. తాజాగా పై-లీన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో గుబులు నెలకొంది. దీనికి తోడు ఖర్చులు పెరగడం, మద్దతు ధర 
 అంతంతే ఉండటంతో రైతుల పరిస్థితి దీనంగా ఉంది. 
 
 పత్తి రైతు చిత్తు
 జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 3.10 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. హెక్టార్‌కు కనీసం 12 క్వింటాళ్లు, మొత్తంగా 37.26 లక్షల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 65లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం పత్తి కాత దశలో ఉంది. 20 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ శాతం పెరగడంతో రసం పీల్చే పురుగులు, పచ్చ, తెల్ల దోమలు, తామర పురుగులు, పేనుబంక పత్తిని ఆశించాయి. కొన్నిచోట్ల వడలు(ఎండు) తెగులు సోకడంతో ఆకులు, కాండం పూర్తిగా వాడిపోయాయి. వీటి నష్టం ఆదిలాబాద్, జైనథ్, బేల, చెన్నూర్, మంచిర్యాల మండలాల్లో అధికంగా ఉంది. ఎకరానికి కనీసం ఎనిమిది క్వింటాళ్ల పత్తి వస్తుందని ఆశించిన రైతన్నలకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
 
 నివారణ చర్యలు..
 ఎండు తెగులకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు, పోశమైసింగ్ లేదా ప్లాంట మైసింగ్ 10 లీటర్ల నీటిలో ఒక గ్రాము కలిపి మొక్కల మొదళ్లలో పోయడం ద్వారా శిలీంద్ర వ్యాప్తిని నివారించవచ్చు. ఉధృతి అధికంగా ఉంటే ఎండిన మొక్కలను పీకేయాలి. ఆకుల కింది భాగంలో, కాయపైన తెల్లటి బూజు వస్తే మూడు గ్రాముల గంధకాన్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పచ్చదోమ నివారణకు ఏసీ ఫేడ్ ఒకటిన్నర గ్రాములు, ఇమిడాక్లోఫ్రిన్ 0.5 ఎంఎల్ లేదా ఏసీటామఫ్రైడ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర ఉధృతికి పిప్రోనిల్ లీటర్ నీటిలో 2 ఎంఎల్ కలిపి చల్లాలి.
 
 ‘వరి’గోస
 ఖరీఫ్‌లో వరి 52,866 హెక్టార్లలో సాగైం ది. హెక్టార్‌కు 50 క్వింటాళ్ల చొప్పున26.43 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుం దని వ్యవసాయ శాఖాధికారులు అంచ నా వేస్తున్నారు. కొన్నిచోట్ల పిలక నుంచి పొట్ట దశలో, మరికొన్ని చోట్ల ఈనే దశ లో ఉంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడంతో ఉల్లికోడు చీడ ఆశిం చింది. నిర్మల్, ఖానాపూర్, బెల్లంపల్లి మండలాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. కాగజ్‌నగర్, లక్సెట్టిపేట, ఖానాపూర్, చెన్నూర్, బెల్లంపల్లిల్లో కాండం తొలుచు పురుగుతోపాటు ఆకుముడత, అగ్గి తెగులు అధికంగా ఉండటంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా అగ్గి తెగులు అధికంగా ఆశిస్తే పంట 60 నుంచి 70 శాతం వరకు నష్టపోయే పరిస్థితి ఉంది.
 
 నివారణ కోసం..
 ఉల్లికోడు నివారణకు ఫోరెడ్ 10జి గుళికలు నీటిలో కలిపి ఎకరానికి 5 కిలో లు పిలుకలు తొడిగిన దశలో పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు ఆశిస్తే క్లోరంత నీలిఫ్రోల్ లీటర్ నీటిలో 3 ఎంఎల్ కలిపి చల్లాలి. అగ్గి తెగులు నివారణకు లీటర్ నీటిలో ఇప్రోబెన్‌ఫాస్ 1.5 ఎంఎల్ లేనిపక్షంలో ఐసోప్రోథయోలిన్ 1.5 ఎంఎల్ లేదా ట్రైసైక్లోజోల్ .6 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
 
 సోయా గయా
 ఈ ఖరీఫ్‌లో సోయాబీన్ 1.19 లక్షల హెక్టార్లలో సాగైంది. గతేడాది కంటే 30 వేల హెక్టార్లలో అధికంగా విస్తీర్ణం పెరి గింది. హెక్టార్‌కు 14 క్వింటాళ్లు దిగుబడి చొప్పున  16.78 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిచోట్ల సోయా కోత దశలో ఉండగా, మరికొన్ని చోట్ల కోతలు అయిపోయాయి. వర్షాలు కోతకు ఆటంకం కలిగిస్తుండటంతో కాయల నుంచి గింజలు మొలకెత్తే పరిస్థితి ఉంది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్లు మించి దిగుబడి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు.
 
 రైతులు జాగ్రత్తలు పాటించాలి..
 - డాక్టర్ సతీష్‌చంద్ర, శాస్త్రవేత్త, ఆదిలాబాద్
 పంట చేతికొచ్చే దశలో రైతులు జాగ్రత్త పాటించాలి. పురుగులు, తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తలను, అధికారులను అడిగి తగు మోతాదులో మందులు వాడాలి. సోయా రైతులు వాతావరణ అనుకూల పరిస్థితులను చూసి కోతలను చేపట్టాలి. వర్షానికి తడిసిన పక్షంలో మొలకెత్తుతాయి. ఎండలో ఆరబెట్టాలి. వరిలో సుడిదోమ కూడా ఆశించే ప్రమాదం ఉంది. రైతులు మెళుకువలను పాటించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement