ప్రతిపాదనలు రాలేదు
ఈ ఏడాది ఎంపీ నిధులకు సంబంధించి మొదటి విడతగా ఒక్కొక్కరికి కేంద్రం రూ.2.5కోట్లు విడుదల చేసింది. జిల్లాలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు కలిపి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి ఎంపీల నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. వారి నుంచి ప్రతిపాదనలు రాగానే ఆ నిధులను ఖర్చు చేస్తాం.
- సీహెచ్ రమణమూర్తి, సీపీఓ
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా ప్రజాప్రతినిధులకు తీరిక లేనట్లుంది..! ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వారి దగ్గర ఉన్న నిధులు ఖర్చుచేసేందుకు సమయం దొరకడం లేనట్లుంది. ఎంపీలుగా ఎన్నికై ఆర్నెల్లకాలం గడుస్తున్నా తమ నిధులు ఖర్చుచేసేందుకు ఇప్పటివరకు ఏ ఒక్క ప్రతిపాదనా అందజేయలేదు. దీంతో వారికి కేటాయించిన ఎంపీ నిధులు ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రతి పార్లమెంట్ సభ్యుడికి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏటా రూ.ఐదుకోట్లు కేటాయిస్తుంది.
అయితే వీటిని ఏడాదిలో రెండుదఫాలుగా రూ.2.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఈ నిధులు ఎంపీలు పదవిలో ఉన్న ఐదేళ్లపాటు విడుదలవుతాయి. వీటన్నింటినీ సంబంధిత పార్లమెంట్ సభ్యుడు సూచించిన పనులకు మాత్రమే ఖర్చుచేసే అవకాశం ఉంటుంది. వీరు ఈ నిధులను తమ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు చేసుకోవచ్చు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, క్రీడలు, లైబ్రరీ, విద్య, ప్రజల ఆరోగ్యం, మరుగుదొడ్లు, విద్యుత్‌దీపాలు తదితర పనులన్నింటికీ ప్రతిపాదనలు చేసి మంజూరుచేసే అవకాశం ఉంది. కాగా, ప్రభుత్వ భవనాల నిర్మాణం, గ్రాంట్లు, రుణాలు, నిరాశ్రయుల పరిహారం తదితర వాటికి ఎంపీ నిధులు ఖర్చుచేసే అవకాశం ఉండదు.
అందని ప్రతిపాదనలు!
జిల్లాలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి ఏపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో రాజ్యసభ సభ్యులు ఒక్కరూ లేరు. దీంతో ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి పద్దుల కింద నిధులు మంజూరయ్యారు. మొదటి విడతగా ఒక్కొక్కరికీ రూ.2.5కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ డబ్బులు వచ్చి దాదాపు రెండు, మూడు నెలలు గడుస్తున్నా.. సంబంధిత పార్లమెంట్ సభ్యుల నుంచి ఏ ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు. ఆరునెలలు గడుస్తున్నా ఇద్దరు ఎంపీలు కూడా ఏ ఒక్క ప్రతిపాదన ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలో ఏ ప్రాంతాన్ని, ఏమూలను తట్టినా సమస్యలు కొకొల్లలు. కనీసం తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు లేక అలమటిస్తున్న ప్రాంతాలు అనేకం ఉన్నా యి. రోడ్డు సౌకర్యం లేక అనేక గ్రామాలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో నెలకొన్న సమస్యల చిట్టాపద్దు చాలదు. జిల్లాలో ఇన్ని సమస్యలు ఉంటే ఎంపీలు మాత్రం వారి దగ్గరున్న పైసలు ఖర్చు చేయడంలేదు. వారి నుంచి ఇప్పటివరకు ప్రణాళికా కార్యాలయానికి ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు.
దత్తత గ్రామాల పరిస్థితి దుర్భరం
ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని దామరగిద్ద మండలంలోని మొగిలి మడక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య కూడా తన నియోజకవర్గ పరిధిలోని మల్దకల్ మండలంలోని అమరవాయి గ్రామాన్ని ఎంచుకున్నారు. అయితే గ్రామాల దత్తత తీసుకున్నారే కానీ ఇప్పటివరకు వాటిపై దృష్టిసారించలేకపోయారు. ఇంకా విచిత్రమేమిటంటే ఇరువురు కూడా దత్తతగ్రామాల వైపు కన్నెత్తి చూడలే కపోయారు.
సారీ.. టైంలేదు!
Published Sat, Dec 20 2014 1:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement