సాక్షి ప్రతినిధి కడప: టీడీపీ నేతలకు ఎన్నికల భయం పట్టుకుందా.. ప్రజామద్దతుతో గట్టెక్కలేకపోయినా అధికారం అండతో నెట్టుకురావాలనే దిశగా పావులు కదుపుతున్నారా.. అంటే ఔను అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓవైపు ప్రజామద్దతు కన్పించడం లేదు. మరోవైపు ప్రజాస్వామ్య పద్ధతిలో ఢీకొంటే పరువు గంగలో కలుస్తోందనే వేదన కుంగదీస్తోంది. వెరసి జీ.. హుజూర్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు అనువుగా ఉంటే ‘నందిని పంది.. పందిని.. నంది’ చేయవచ్చనే దిశగా ఓ మంత్రి పావులు కదుపుతున్నారు. వెరసిఅర్ధాంతర బదిలీల అలజడి సృష్టిస్తున్నాయి.
జిల్లాలో గడిచిన మూడేళ్ల కాలంలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీపై వెళ్లారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ప్రజామద్దతు దక్కినా అధికారపార్టీ నాయకులను మచ్చిక చేసుకోకపోవడంతో ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. తాజాగా ఎస్పీ బాబూజీ అట్టాడపై ఓ మంత్రి కన్ను పడింది. ఈయనే ఎన్నికల వరకు కొనసాగితే అప్రజాస్వామ్యక చర్యలకు అడ్డుకట్టపడుతోందనే భావన ఉండడమే అందుకు కారణంగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఫలానా అధికారినే జిల్లాలో నియమించాలని ఇప్పటికే చినబాబుకు వివరించి, పెద్దబాబుకు తెలియజేసినట్లు సమాచారం.అనువైన అధికారుల కోసం టీడీపీ నేతలు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఎన్నికల టీమ్ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు.
రెవెన్యూ యంత్రాంగంలో గుబులు..
కడప ఆర్డీఓ దేవేంద్రరెడ్డి సరెండర్ వ్యవహారం రెవెన్యూ యంత్రాంగంలో గుబులు రేపుతోంది. తొలుత సీఎం సమావేశంపై నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వేటు వేశారని ఉద్యోగులు భావించారు. తర్వాత ఆర్డీఓ సరెండర్ వ్యవహారం తీరు తెన్నులు తెలుసుకున్న రెవెన్యూ ఉద్యోగుల్లో అలజడి రేగుతోంది. తప్పొప్పులు డేవుడెరుగు ప్రత్యేకించి ఆర్డీఓను అవమానించిన తీరు తెలుసుకున్న యంత్రాంగంలో చర్చ నడుతోస్తోంది. కనీస వివరణ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడిన వైనం, ఆపై అవమానకరంగా వ్యవహరించిన ధోరణి తెలుసుకున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మునుపెన్నడూ ఇలాంటి అధ్వానస్థితి చవిచూడలేదని, టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి అర్ధాంతరంగా బలి చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి.
చెప్పినట్లు వింటారా..వెళ్లిపోతారా..
జిల్లాలో టీడీపీ నేతలు అధికారులపై విరుచుకుపడుతున్నారు. చెప్పినట్లు వింటారా...ఇక్కడి నుంచి వెళ్లిపోతారా...అంటూ హుకుం ప్రదర్శిస్తున్నారు. కమలాపురం, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఈ తంతు అధికమైందని ఓ అధికారి వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే నాటికి ఆయా నేతలకు అనువైన ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఇప్పటికే డ్రాచేసుకున్న మొత్తానికి రికార్డులు సవరించాలని పంచాయితీలల్లో ప్రత్యేక అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. అలా కాదు కూడదంటే బెదిరింపులకు దిగుతున్నారు. మా ప్రభుత్వం మమ్మల్ని మెప్పించినోళ్లే పనిచేస్తారు, మీరు వెళ్లిపోండంటూ జులుం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నేతల దుశ్చర్యలను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు తద్భిన్నంగా వ్యవహారిస్తోండడం విశేషం.
టీడీపీ నేతలకు ఎన్నికల భయం
Published Thu, Aug 30 2018 7:46 AM | Last Updated on Thu, Aug 30 2018 7:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment