
ఆపరేషన్ ఏరివేత ఇష్టారాజ్యంగా డీలర్ల తొలగింపు
పశ్చిమ ప్రకాశంలో అధికార పార్టీ నేతలు డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా డీలర్లను తొలగిస్తున్నారు.
♦ వైఎస్సార్ సీపీ మద్దతు డీలర్లపై ఒత్తిళ్లు
♦ కుంటి సాకులతో రేషన్ షాపుల తొలగింపు
♦ పశ్చిమాన 12 మండలాల్లో బినామీల హవా
♦ తమ్ముళ్ల ఆదేశాలకు తలొగ్గుతున్న అధికారులు
♦ వేధింపులతో కొందరు స్వచ్ఛందంగా రాజీనామా
♦ గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు డీలర్లే టార్గెట్
♦ మార్కాపురం డివిజన్‌లో ఇప్పటికే 67 రేషన్ షాపులు ఖాళీ
పశ్చిమ ప్రకాశంలో అధికార పార్టీ నేతలు డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా డీలర్లను తొలగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారు డీలర్లపై తప్పుడు కేసులు నమోదు చేరుుంచి ఆ షాపులను డ్వాక్రా సంఘాల పేరుతో తెలుగు తమ్ముళ్లకు కట్టబెడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పశ్చిమ ప్రకాశంలోని 12 మండలాల్లో ఇప్పటికే సుమారు 67 మంది డీలర్లను కుంటి సాకులు చూపి తొలగించారు. - మార్కాపురం
పశ్చిమ ప్రకాశంలోని 12 మండలాల్లో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రేషన్ దుకాణాల్లో బినామీ డీలర్లదే హవాగా మారింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటంతో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న డీలర్లపై ఆ పార్టీ నేతలు అధికారుల ద్వారా వత్తిడి చేయిస్తున్నారు. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు వైఎస్సార్ సీపీ మద్దతు డీలర్లు రాజీనామా బాట పట్టారు.
ఇవిగో ఖాళీలు
బేస్తవారిపేట మండలం పెంచికలపాడు, కంభం మండలం ఎర్రబాలెం, తురిమెళ్ల, నర్సిరెడ్డిపల్లె, తదితర గ్రామాల రేషన్ షాపులకు డీలర్లు లేరు. గిద్దలూరు మండలం ముండ్లపాడు, సూరేపల్లె, కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లె, మార్కాపురం మండలం గజ్జలకొండ, బోడపాడు, భూపతిపల్లె, నాయుడుపల్లె, తిప్పాయపాలెం, పెద్దయాచవరం, జమ్మనపల్లి, పెద్దయాచవరం, కొండేపల్లి దుకాణాలకు కూడా డీలర్లు లేరు. పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లె, కలనూతల, గొబ్బూరు, బి.చెర్లోపల్లె, పుల్లలచెరువు మండలం అక్కపాలెం, నాయుడుపల్లి, సిద్ధినపాలెం, ఐటీవరం, నరజాముల తండా, ఐటీవరం, త్రిపురాంతకం మండలం త్రిపురాంతకం, దూపాడు, గణపవరం, జి.ఉమ్మడివరం, ఎండూరివారిపాలెం, రామసముద్రం, నడిగడ్డ, లేళ్లపల్లి, టి.చెర్లోపల్లె, కంకణాలపల్లె, సోమేపల్లి, హసనాపురం, వెంగాయపాలెం, ఒడ్డుపాలెం, మిరియంపల్లి, వెల్లంపల్లి, డీబీఎన్ కాలనీ, జీఎస్ తండాల రేషన్‌షాపుల డీలర్లు రాజీనామా చేశారు.
యర్రగొండపాలెం మండలం బోయలపల్లి, యర్రగొండపాలెం, గోళ్లవీడిపి, సర్వాయపాలెం,గంజివారిపల్లె, గురిజేపల్లి, కొలుకుల, దోర్నాల మండలం యడవల్లి, దోర్నాల 4, కటకానిపల్లె, కడపరాజుపల్లి, ఐనముక్కల 1, 2, బోడెనాయక్ తండా, రాచర్ల మండలం రామాపురం, తదితర గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో చాలామంది డీలర్లు రాజీనామాలు చేయగా మరికొంత మంది డీలర్లపై అధికారులు 6ఏ కేసులు నమోదు చేయటంతో ఖాళీలు ఏర్పడ్డారుు. వీరి స్థానంలో పొదుపు సంఘాల సభ్యులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. రాజీనామా చేసిన డీలర్లు 90 శాతం మంది విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఒత్తిళ్లకు తట్టుకోలేక డీలర్‌షిప్‌లను వదులుకున్నారు.
వీరిని ఎదిరించిన డీలర్లపై రెవెన్యూ అధికారులు 6ఏ కేసులు, మరీ లొంగకపోతే పోలీసు కేసులు కూడా పెట్టారు. బినామీ డీలర్లు కావటంతో అధికారులు కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. వినియోగదారులకు రేషన్‌షాపుల ద్వారాసరఫరా చేసే బియ్యం, చక్కెర, కిరోసిన్ సక్రమంగా అందడం లేదు. మొత్తం మీద పశ్చిమ ప్రకాశంలో బినామీ డీలర్ల హవా కొనసాగుతోంది. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు కలిసి డీలర్ పోస్టులను భర్తీ చేస్తే ప్రజలకు నిత్యావసరాలు సక్రమంగా అందుతారుు.