రాజకీయాల్లో ఎందుకుండొద్దు? | Telangana JAC leaders thinks of entering politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో ఎందుకుండొద్దు?

Published Tue, Nov 5 2013 2:04 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

రాజకీయాల్లో ఎందుకుండొద్దు? - Sakshi

రాజకీయాల్లో ఎందుకుండొద్దు?

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎందుకు ఉండకూడదనే చర్చ జేఏసీలో మొదలైంది. ఎన్నో త్యాగాలు చేసి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇదే సంప్రదాయ రాజకీయ నాయకత్వం చేతిలో పెడితే ఎలా? అని పలువురు నేతలు ప్రశ్నించారు. జేఏసీ పాత్ర ఇక్కడికే పరిమితం కాకుండా చూడాలని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ శివారులో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం సమీపబంధువు రతన్‌కు చెందిన ఫాంహౌస్‌లో సోమవారం జరిగిన విందులో ఈ కీలక అంశంపై ఆసక్తికరమైన ఇష్టాగోష్టి చర్చ జరిగింది.

తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నేత బాలనర్సయ్య ఈ విందు ఏర్పాటు చేశారు. జేఏసీ ముఖ్యనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో జేఏసీ పాత్ర రాజకీయంగానూ, సామాజికంగానూ ఉండాలని నేతలు ఆకాంక్షించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ పాత్ర ఉండాల్సిందేన ని చాలామంది అంటున్నరు. నేను ఎక్కడికైనా వెళ్తే సామాజిక, వ్యక్తిగత సమస్యలను చెప్పుకుంటున్నరు. ఒకాయన వర్షాల వల్ల పంట పాడైందని, నష్టపరిహారం ఇప్పించాలని అడిగిండు. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రివో, మంత్రివో అయితవు కానీ నా పరిహారాన్ని మర్చిపోకు అని అన్నడు. ఇవన్నీ వింటూంటే జేఏసీపై ప్రజలకు చాలా నమ్మకమైతే ఉందనిపిస్తోంది’ అని కోదండరాం వ్యాఖ్యానించినట్టు సమాచారం. జేఏసీ పాత్ర ఏ రూపంలో ఉండాలనేదానిపై టీఆర్‌ఎస్ కదలికలను బట్టి మాట్లాడుకోవాలని సూత్రప్రాయంగా అనుకున్నారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను రహస్యంగా ఎందుకు కలిశారని, దీనివల్ల స్థానికంగా ఇబ్బందులు వస్తున్నాయని నిజామాబాద్ జేఏసీ అధ్యక్షుడు గోపాలశర్మ, మరికొందరు కోదండరాంను నిలదీసినట్టు సమాచారం. పరస్పర అవసరాలు ముఖ్యంగా ఉద్యమ అవసరాలే ఇందులో ఉన్నాయని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు తెలంగాణకు సానుకూల నిర్ణయాలు, పరిణామాలు ఉంటున్న సమయంలో జీవోఎంను కలవాల్సిన అవసరం లేదని భావించారు. నవంబర్‌లో తెలంగాణ బిల్లు సిద్ధమై, డిసెంబర్‌లో పార్లమెంటులో పెట్టే అవకాశాలున్నాయన్న అంచనాకు వచ్చారు. రాష్ట్ర పర్యటనలోనే ఉన్న రాష్ట్రపతిని కలవాలని, ఇక్కడ వీలుకాకుంటే ఢిల్లీకి వెళ్లి కలవాలని నిర్ణయించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement