కేజీబీవీ విద్యార్థినుల్లో ఇంగ్లిష్‌ టెన్‌షన్‌ | Ten exams in the English medium from this year | Sakshi
Sakshi News home page

కేజీబీవీ విద్యార్థినుల్లో ఇంగ్లిష్‌ టెన్‌షన్‌

Published Sun, Aug 20 2017 12:10 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

కేజీబీవీ విద్యార్థినుల్లో ఇంగ్లిష్‌ టెన్‌షన్‌

కేజీబీవీ విద్యార్థినుల్లో ఇంగ్లిష్‌ టెన్‌షన్‌

ఈ ఏడాది నుంచి  ఇంగ్లిష్‌ మీడియంలో పది పరీక్షలు
ఫలితాలపై సిబ్బందిలో ఆందోళన


కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మధ్యలో బడిమానేసిన బాలికలకు విద్య అందించాలనే లక్ష్యంతో  కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక స్థాయిలో మెరుగైన విద్యాబోధన అందకపోవడంతో చాలా మంది విద్యార్థినులకు మాతృ భాషపైనే సరైనపట్టులేని పరిస్థితి. అయినా పట్టుదలతో చాలా మంది విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ఉన్నట్టుండి ఈ ఏడాది నుంచి కస్తుర్బాలో పదవ తరగతి చదువుతున్న బాలికలలకు ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితాల్లో తేడాలు వస్తే సిబ్బందిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అటు విద్యార్థినులు, ఇటు సిబ్బందిలో  ఆందోళన మొదలైంది.

చింతపల్లి:
మన్యంలోని 11 మండలాల్లో 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. దాదాపు మూడు వేల మంది బాలికలు చదుతున్నారు. వీరంతా కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలో బడిమానేసిన పిల్లలే. చదువుపై ఉన్న ఆసక్తితో మళ్లీ బడిలో చేరారు. చాలా విద్యాలయాల్లో పూర్తిస్థాయి సిబ్బందిలేరు. సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయడంలేదు. ఈ సమస్యలపై దృష్టిపెట్టని ప్రభుత్వం, విద్యావిధానంలో మార్పులు తెచ్చేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు బాలికలకు భారంగా మారుతున్నాయి.

మధ్యలో బడిమానేయడం వల్ల  మాతృభాషపైనే పెద్దగా పట్టులేని బాలికలకు ఈ ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షలు ఇంగ్లిషు మీడియంలో నిర్వహించేందుకు అధికారులు రంగంసిద్ధం చేస్తుండడంతో  ఆందోళన మొదలైంది. కేజీబీవీల్లో 2015–16 నుంచి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. తొలి ఏడాది 6,7,8 తరగతులకు మాత్రమే వర్తింపజేశారు. అప్పటి 8వ తరగతి విద్యార్థినులు ఈ విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఆంగ్లమాధ్యమంలో బోధన మొక్కుబడిగా సాగుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఇంగ్లిషు మీడియంలో పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉత్తీర్ణులం కాగలమని  బాలికలు ఆందోళన చెందుతున్నారు. ఆంగ్లంలో నాణ్యమైన విద్యాబోధన అందించిన తరువాత నూతన విధానాలు ప్రవేశపెట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు.

ఫలితాలు తగ్గితే చర్యలు
గత ఏడాది పదోతరగతి పరీక్షలను కొలమానంగా తీసుకుని ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు విద్యాలయాల్లో బోధకులపై చర్యలకు ఉపక్రమించారు. ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలు ఆంగ్లమాధ్యమంలో రాయాల్సిఉంది. నిరంతరం మూల్యాంకనంతో విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావాలి. ఆశించిన ఉత్తీర్ణత సాధించకపోతే బోధకులు, ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటామని సర్వశిక్షాభియాన్‌ ఉన్నత అధికారులు కస్తూర్బా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఇంగ్లిషు మీడియంలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు, ఫలితాలపై సిబ్బంది  ఆందోళన చెందుతున్నారు.

ఆందోళనగా ఉంది
ఇంగ్లిషుమీడియంలో పరీక్షలు రాయాలంటే ఆందోళనగా ఉంది. మొదటి నుంచి నాణ్యమైన విద్యాబోధన జరిగిఉంటే ఇంగ్లి షుపై పట్టుసాధించేవాళ్లం. మధ్యలో బడిమానేసి మళ్లీ కస్తూర్బాలో చేరాం. ఆంగ్లమాధ్యమంపై అంతపట్టు సాధించలేకపోతున్నాం.
– రాజేశ్వరి, కేజీబీవీ విద్యార్థిని, పదో తరగతి
తెలుగులోనే పరీక్షలు నిర్వహించాలి
రెండేళ్లకే ఆంగ్లభాషపై పట్టుసాధించడం అంత సులభంకాదు. 2015లో నుంచి ఆంగ్లబోధన చేస్తున్నారు. ఇప్పుడే పరీక్షలు ఇంగ్లిషులో పెడితే ఉత్తీర్ణత సాధించడం కష్టం. పూర్తిస్థాయిలో మెరుగైన బోధన అందించకుండా పరీక్షలు పెట్టడం సరికాదు. తెలుగులోనే నిర్వహించాలి.
– రాజ్యలక్ష్మి, పదో తరగతి, జీకే వీధి

ప్రత్యేక శ్రద్ధ
ఆంగ్లమాధ్యమంలో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.  ఆందోళన చెందకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి అవసరమైన తర్ఫీదు ఇస్తున్నాం.
– సూర్యకుమారి, ప్రత్యేక అధికారిని, కస్తూర్బాగాంధీ విద్యాలయం, జీకే వీధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement