ఆ ఐదు సంతకాల అమలేదీ!
పింఛన్లకు తప్ప ఏ ఒక్క పథకానికీ రూపాయి విదల్చని సర్కార్
హైదరాబాద్: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన తొలి ఐదు సంతకాల అమలు ఆరు నెలలు గడిచినా పూర్తికాకుండా మధ్యలోనే నిలిచిపోయింది. ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు.
రుణాల మాఫీపై రోజుకో మెలిక
చంద్రబాబు రుణమాఫీ ప్రకటన చేసేనాటికి రైతుల పేరిట దాదాపు రూ.87 వేల కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో రూ.14 వేల కోట్లు, చేనేతకు సంబంధించి ఇంకొక రూ.700 కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీపై ఎన్నో మాటలు మార్చారు. అనేక వడపోతలు, ఆంక్షల అనంతరం ఆరు నెలల్లో కాలంలో ఇప్పటివరకు కేవలం సుమారు రూ.15 వేల కోట్ల రుణాలే మాఫీకి అర్హమైనవిగా తేల్చారు. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేల చొప్పున సాయం మాత్రమే చేస్తామని మాట మార్చారు.
పింఛన్లకు భారీ కోత..
బాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన ఐదు సంతకాల్లో ఒకటైన పింఛన్ల పథకానికి మాత్రమే ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత ఖర్చు చేసింది. అయితే అర్థిక భారం తగ్గించుకోవడానికి బాబు లక్షలాది పింఛనుదారుల నోట మట్టి కొట్టారు. సెప్టెంబర్‌కు ముందు రాష్ట్రంలో 43 లక్షల మంది పింఛనుదారులుంటే, డిసెంబర్‌లో 37 లక్షల మంది పింఛనుదారులకు మాత్రమే పింఛన్ల పంపిణీ జరుగుతోంది.
దాతలు ముందుకొస్తేనే.. మంచినీటి ప్లాంట్లు
ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ పంపిణీ చేస్తామంటూ.. ఆ పథకానికి దివంగత ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ సుజల అని పేరు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకం పూర్తిగా అపహాస్యం పాలయ్యేలా వ్యవహరిస్తోంది. బాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు తొలి సంతకాల జాబితాలో దీనిని చేర్చిన చంద్రబాబు ఇందుకోసం రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు.
సగం ఉద్యోగులకు వర్తించని ‘60 ఏళ్లు’
ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు రూపాయి భారం పడని ఉద్యోగుల 60 ఏళ్ల పదవీ విరమణ వయసు పెంపు హామీ అమలు అందరికీ వర్తించకుండా ఆగిపోయింది.
కానరాని బెల్టుషాపుల నిర్మూలన కమిటీలు
మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేయడంతో గ్రామ, మండల స్థాయిల్లో ఏర్పాటైన బెల్టు షాపుల నిర్మూలన కమిటీల జాడే కాన రావడం లేదు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఈ కమిటీల్లో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ స్థాయిలో సర్పంచ్, వీఆర్వో, ప్రధానోపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, మండల స్థాయిలో ఎస్సై, తహశీల్దారు, ఎంపీపీ, ప్రధానోపాధ్యాయులతో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నాయో ఈ కమిటీలు గుర్తించి వాటి సమాచారం టాస్క్‌ఫోర్స్ అందించాలి. అయితే ఈ కమిటీలు ఎక్కడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని స్వయంగా ఎక్సైజ్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.