పన్నుల వసూళ్ల తీరు ఇదేనా?
వికలాంగుడ్ని ఇంట్లో ఉంచి తాళాలు
జీవీఎంసీ రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు
విశాఖపట్నం పన్నుల వసూళ్లలో జీవీ ఎంసీ అధికారులు కొత్త పోకడలకు తెర తీస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఎలాగైనా లక్ష్యాలను అధిగమించాలన్న ఆలోచనతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై తమ ప్రతాపం చూపుతున్నారు. వైశాఖి జల ఉద్యానవనం ఎదురుగా ఉదయ్‌శంకర్ పాతికేళ్లుగా సొంత ఇంట్లో నివాసముంటున్నాడు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ఇంటికి ఏడాదికి రూ.5 వేల చొప్పున ఇంటి పన్ను చెల్లించేవాడు. నాలుగేళ్ల క్రితం ఉన్నపళంగా ఏడాదికి రూ.25 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపించారు. తాను నిరుపేదనని. పైగా వికలాంగుడినని.. అంత పన్ను చెల్లించలేనని జీవీఎంసీ అధికారులకు మొర పెట్టుకున్నాడు. పన్ను తగ్గించాలంటూ పలుమార్లు కార్యాలయం చుట్టూ... ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో పన్ను బకాయిలు కాస్తా ప్రస్తుతం రూ.70 వేలకు చేరుకున్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం ఆయన ఇంటికి వచ్చింది. పన్ను వెంటనే చెల్లించకపోతే ఇంటికి తాళాలు వేస్తామని సిబ్బంది హెచ్చరించారు. తాను చెల్లించలేని స్థితిలో ఉన్నానని.. పన్ను తగ్గించాలని మరోసారి అభ్యర్థించాడు. మాకు సంబంధం లేదు.. డిమాండ్ నోటీసులో ఉన్న పన్ను మొత్తాన్ని వెంటనే చెల్లించి తీరాల్సిందేనని పట్టుబట్టారు. చెల్లించలేనని చెప్పడంతో ఇంటికి తాళాలు వేసేస్తామని హెచ్చరించిన అధికారులు ఉదయ్‌శంకర్ ఇంట్లో ఉండగానే ఇంటికి తాళాలు వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
జీవీఎంసీ పరిధిలో 4,22,668 ఎస్సెస్‌మెంట్స్ ఉన్నాయి. అనకాపల్లిలో 18,659, భీమిలిలో 12,913 ఎస్సెస్‌మెంట్స్ ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్నుల డిమాండ్ రూ.202.01కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.155 కోట్లు వసూలు చేశారు. వాటర్ టాక్స్‌స్ రూ.168కోట్ల వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.132 కోట్లు వసూలు చేశారు. కాగా మొండిబకాయిలు రూ.54 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ బకాయిల వసూలు కోసం శ్రమిస్తూ.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో బడాబాబుల విషయంలో మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.
ఒత్తిడి తెస్తున్నారే తప్ప వేధింపుల్లేవు
గతేడాది డిసెంబర్ నాటికి రూ.75 కోట్లు వసూలు చేశాం. ఈ ఏడాది అదే డిసెంబర్ నాటికి రూ.146 కోట్లు వసూలయ్యాయి. ఒత్తిడి చేయకపోతే పన్నులు వసూలు కావు కదా.. బకాయిలు రాబట్టుకునేందుకే తప్ప మా సిబ్బంది ఎవర్నీ వేధింపులకు గురి చేయడం లేదు. -వి.రవీంద్ర, డిప్యూటీ కమిషనర్, రెవెన్యూ
ఇదెక్కడి చోద్యం!
Published Thu, Mar 3 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement