Udaysankar
-
వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి
‘‘ఇప్పుడు సినిమాల్లో కొత్త భావనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, నూతన దర్శకులు, నటీనటులు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ‘మిస్ మ్యాచ్’ కూడా అదే కోవలో కనపడుతోంది’’ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్.వి. నిర్మల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో హరీశ్‌రావు మాట్లాడుతూ– ‘‘స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రమిది. ఓ ప్రేమికురాలి విజయం కోసం ప్రేమికుడు పడే తపనను చూపిస్తుంది. సినిమాల్లో మంచి సందేశం ఉండి గౌరవం పెరగాలి. వ్యక్తిత్వం ప్రతిబింబించేలా, మహిళల గౌరవం పెరిగేలా సినిమాలుండాలి. ‘మిస్ మ్యాచ్’ సినిమా సమాజంతో మ్యాచ్ అయి మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘ఉదయ్‌శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐశ్వర్యా రాజేష్ అమ్మగారు నాతో పాటు 50–60 సినిమాలకు కలిసి పనిచేశారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో ఐశ్వర్య తెలుగులో సిక్సర్ కొట్టింది. ఈ సినిమాలో తను ఆడే ఆటతో బాక్సాఫీస్ బద్దలవుతుంది’’ అన్నారు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘అమ్మాయిలు ఉన్నత స్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్టపడతాను. ఆ తరహాలో ఉండే ‘రాజా, సూర్యవంశం’ వంటి సినిమాల్లో నేను కూడా నటించాను. ‘మిస్ మ్యాచ్’ తప్పకుండా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘నేను గురువుగా భావించే శ్రీరామ్సార్గారి తనయుడి చిత్రోత్సవానికి రావడం సంతోషంగా భావిస్తున్నా’’ అన్నారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘‘సగటు సినిమా ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. ‘‘తెలివైన అబ్బాయి.. పల్లెటూరి అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అన్నారు నిర్మల్ కుమార్. ‘‘మంచి కథతో రూపొందించిన చిత్రమిది’’ అన్నారు జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) దేశపతి శ్రీనివాస్, తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ రామ్మోహనరావు, నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్, రచయిత భూపతి రాజా, మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదెక్కడి చోద్యం!
పన్నుల వసూళ్ల తీరు ఇదేనా? వికలాంగుడ్ని ఇంట్లో ఉంచి తాళాలు జీవీఎంసీ రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు విశాఖపట్నం పన్నుల వసూళ్లలో జీవీ ఎంసీ అధికారులు కొత్త పోకడలకు తెర తీస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఎలాగైనా లక్ష్యాలను అధిగమించాలన్న ఆలోచనతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై తమ ప్రతాపం చూపుతున్నారు. వైశాఖి జల ఉద్యానవనం ఎదురుగా ఉదయ్‌శంకర్ పాతికేళ్లుగా సొంత ఇంట్లో నివాసముంటున్నాడు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ఇంటికి ఏడాదికి రూ.5 వేల చొప్పున ఇంటి పన్ను చెల్లించేవాడు. నాలుగేళ్ల క్రితం ఉన్నపళంగా ఏడాదికి రూ.25 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపించారు. తాను నిరుపేదనని. పైగా వికలాంగుడినని.. అంత పన్ను చెల్లించలేనని జీవీఎంసీ అధికారులకు మొర పెట్టుకున్నాడు. పన్ను తగ్గించాలంటూ పలుమార్లు కార్యాలయం చుట్టూ... ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో పన్ను బకాయిలు కాస్తా ప్రస్తుతం రూ.70 వేలకు చేరుకున్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం ఆయన ఇంటికి వచ్చింది. పన్ను వెంటనే చెల్లించకపోతే ఇంటికి తాళాలు వేస్తామని సిబ్బంది హెచ్చరించారు. తాను చెల్లించలేని స్థితిలో ఉన్నానని.. పన్ను తగ్గించాలని మరోసారి అభ్యర్థించాడు. మాకు సంబంధం లేదు.. డిమాండ్ నోటీసులో ఉన్న పన్ను మొత్తాన్ని వెంటనే చెల్లించి తీరాల్సిందేనని పట్టుబట్టారు. చెల్లించలేనని చెప్పడంతో ఇంటికి తాళాలు వేసేస్తామని హెచ్చరించిన అధికారులు ఉదయ్‌శంకర్ ఇంట్లో ఉండగానే ఇంటికి తాళాలు వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. జీవీఎంసీ పరిధిలో 4,22,668 ఎస్సెస్మెంట్స్ ఉన్నాయి. అనకాపల్లిలో 18,659, భీమిలిలో 12,913 ఎస్సెస్మెంట్స్ ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్నుల డిమాండ్ రూ.202.01కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.155 కోట్లు వసూలు చేశారు. వాటర్ టాక్స్స్ రూ.168కోట్ల వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.132 కోట్లు వసూలు చేశారు. కాగా మొండిబకాయిలు రూ.54 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ బకాయిల వసూలు కోసం శ్రమిస్తూ.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో బడాబాబుల విషయంలో మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఒత్తిడి తెస్తున్నారే తప్ప వేధింపుల్లేవు గతేడాది డిసెంబర్ నాటికి రూ.75 కోట్లు వసూలు చేశాం. ఈ ఏడాది అదే డిసెంబర్ నాటికి రూ.146 కోట్లు వసూలయ్యాయి. ఒత్తిడి చేయకపోతే పన్నులు వసూలు కావు కదా.. బకాయిలు రాబట్టుకునేందుకే తప్ప మా సిబ్బంది ఎవర్నీ వేధింపులకు గురి చేయడం లేదు. -వి.రవీంద్ర, డిప్యూటీ కమిషనర్, రెవెన్యూ