
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోట్లాది రూపాయల డిపాజిట్ల భద్రతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, టీటీడీ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ సూచనల మేరకు భద్రత విషయంలోనూ, బ్యాంకుల ఎంపికలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ చెబుతున్నప్పటికీ భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు, రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి టీటీడీకి చెందిన రూ.4 వేల కోట్ల డిపాజిట్లను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు కట్టబెట్టారని సంచలన ఆరోపణ చేశారు. ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును పక్కన పెట్టి దానికంటే తక్కువ కొటేషన్ దాఖలు చేసిన ఆంధ్రా బ్యాంకుకు రూ.3 వేల కోట్లు, ప్రైవేటు బ్యాంకు ఇండస్‌కు రూ.1,000 కోట్లు డిపాజిట్లు ఇవ్వడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందులో పెద్దఎత్తున అవకతవకలు ఉన్నాయని నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
ప్రైవేటు బ్యాంకుకు రూ.1000 కోట్లు
టీటీడీకి చెందిన రూ.10,589 కోట్ల డిపాజిట్లలో ఈ మార్చి 31 నాటికి రూ.4 వేల కోట్ల విలువైన డిపాజిట్ల కాలపరిమితి ముగిసింది. వీటిని తిరిగి డిపాజిట్ చేసే క్రమంలో టీటీడీ అధికారులు వివిధ బ్యాంకుల నుంచి వడ్డీ రేట్లు కోరుతూ సీల్డు బిడ్ కొటేషన్లు ఆహ్వానించారు. తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకులు, నాలుగు ప్రైవేటు బ్యాంకులు సమర్పించిన సీల్డు బిడ్ కొటేషన్లను పరిశీలించిన అధికారులు ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు (వడ్డీ 7.32 శాతం), ఇండస్ బ్యాంకులో రూ.1,000 కోట్లు (వడ్డీ 7.66 శాతం) డిపాజిట్లు చేశారు. దీంతో కొటేషన్ల స్వీకరణ, బ్యాంకుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును కాదని దానికంటే తక్కువ వడ్డీ కోట్ చేసిన బ్యాంకులకు డిపాజిట్లు అప్పగిం చారని నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతా పారదర్శకమే..
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఈ విషయమై మీడియాకు వివరణ ఇస్తూ.. టీటీడీ నగదును డిపాజిట్ చేసే విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టంచేశారు. సీల్డు కొటేషన్లు పరిశీలించాకే బ్యాంకుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను బట్టి డిపాజిట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికితోడు టీటీడీ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ సూచనల మేరకు కొటేషన్లు ఆహ్వానించగా 9 జాతీయ బ్యాంకులు, 4 ప్రైవేటు బ్యాంకులు తాము చెల్లించే వడ్డీ రేటును వెల్లడిస్తూ కొటేషన్లు పంపాయన్నారు. అదనపు వడ్డీ రాబట్టేందుకు రివైజ్డ్ కొటేషన్ల అడిగామన్నారు. తుది కొటేషన్లు పరిశీలించాకే ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు, ఇండస్ బ్యాంకులో రూ.1000 కోట్లు డిపాజిట్లు చేశామన్నారు. విజయా బ్యాంకు 7.27శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తామని చెప్పిందన్నారు.