జిల్లా పోలీసులు కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు గ్రీవెన్స్‌డేకు జోరువానను సైతం లెక్కచేయక బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేసి న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకున్నారు. ఏఎస్పీ బీ శరత్‌బాబు, ఎస్సీ, ఎస్టీ సెల్–2, ట్రాఫిక్ డీఎస్పీలు ఎన్ సుధాకర్, ఎన్ రామారావు బాధితుల సమస్యలను పరిశీలించి సత్వర న్యాయం అందించాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కాగా జోరు వర్షంతో గ్రీవెన్స్‌డేకు వచ్చిన బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌డేకు వచ్చే బాధితుల కోసం అధికారులు టెంట్లు వేసేవారు. సోమవారం వర్షం కురుస్తుండటంతో టెంట్లు వేయలేదు. దీంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు వర్షంలో తడిసి ముద్దయ్యారు. కొందరు పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని చెట్లు, సన్‌సైడ్‌ల కింద నిలబడ్డారు.
భార్య ఆచూకీ కోసం..
పెయింట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. గ్రామానికి చెందిన అనూష, నేను ప్రేమించుకున్నాం. అనూష తల్లిదండ్రులు బలవంతంగా మేనమామతో వివాహం జరిపేందుకు నిశ్చయించగా, సెప్టెంబర్ 30న అర్ధరాత్రి మా ఇంటికి వచ్చింది. మా ప్రేమ విషయాన్ని గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లగా అనూష తల్లిదండ్రులను పిలిచి మాట్లాడారు. దీంతో ఆమెను నా వద్ద వదిలి వెళ్లారు. దీంతో ఈనెల 1న కోమటిగుంటలో వివాహం చేసుకున్నాం. 2న ఉదయం అనూష మేనమామ కొందరితో గ్రామపెద్దలు రమ్మంటున్నారని చెప్పి ఇద్దర్ని ఆటోలో తీసుకుని వెలికల్లుకు బయలుదేరాడు. గ్రామ సరిహద్దులో నన్ను బలవంతంగా ఆటోలో నుంచి గెంటేసి నా భార్యను తీసుకెళ్లిపోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
–గురకల హరికృష్ణ, వెలికల్లు, డక్కిలి మండలం
రక్షణ కల్పించండి
నేను, జోష్మిత పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నాం. అప్పట్లో ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి చంపుతామని బెదిరించడంతో బీవీనగర్‌కు వచ్చేశాను. ప్రస్తుతం నేను దుస్తుల దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నా. జోష్మిత చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఈనెల 25న ఇద్దరం తిరుపతిలో వివాహం చేసుకున్నాం. ఈ విషయం తెలుసుకున్న జోష్మిత కుటుంబసభ్యులు నాపై బుచ్చి, చెన్నై పోలీసు స్టేషన్‌లలో కేసులు పెట్టారు. జోష్మిత తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి. –పవన్, బీవీనగర్, నెల్లూరు
న్యాయం చేయండి
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. మా ఇంటి పక్కనే విలేకరి గౌస్ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ నెల 28న రెండున్నరేళ్ల మనుమడు జహీర్ పిల్లలతో ఆడుకుంటూ గౌస్ తలుపుడోర్‌ను తగిలాడు. దీంతో గౌస్ భార్య గొడవకు దిగడంతో పాటు తన భర్తతో పోలీసులకు ఫోను చేయించింది. కొడవలూరు పోలీసులు నన్ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. జరిగిన విషయం చెప్పడంతో జామీన్‌పై ఇంటికి పంపారు. అప్పట్నుంచి గౌస్ భార్య దుర్భాషలాడుతోంది. వారికి పలుకుబడి ఉండటంతో తిరిగి మాపై కేసులు పేట్టే అవకాశం ఉంది. విచారించి న్యాయం చేయండి. –ఎస్‌కే ఖాదర్‌వలి, యల్లాయపాళెం, కొడవలూరు
Comments
Please login to add a commentAdd a comment