భద్రాచలం, న్యూస్‌లైన్ : ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం మంగళవారం రాత్రి 7గంటలకు 45.5 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే కొనసాగుతోంది. 62 అడుగుల నీటిమట్టంతో ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టడటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి తగ్గటంతో ముంపు నుంచి గ్రామాలు బయట పడ్డాయి. భద్రాచలం నుంచి వాజేడు వరకూ.., అదే విధంగా చింతూరుకు రాకపోకలు సాగాయి. ఆర్టీసీ బస్సులను కూడా ఈ రహదారుల్లో నడిపారు. నాలుగు రోజులుగా నిలిపి వేసిన విద్యుత్ సరఫరాను ఆ శాఖాధికారులు ఒక్కో ఫీడర్‌లో పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేక మూగపోయిన సెల్‌ఫోన్‌లు మంగళవారం సాయంత్రం నుంచి పనిచేయటంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. వరద తగ్గినప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక ఉన్నందున భద్రాచలం డివిజన్‌లో 59 పునరావాస కేంద్రాలను కొనసాగిస్తూ 3,109 కుటుంబాలకు చెందిన 11,483 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
ఇంకా జల దిగ్బంధమే...
వరద తగ్గుముఖం పట్టినప్పటికీ భద్రాచలం డివిజన్‌లోని చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వాజేడు మండలంలో దూలాపురం, ఏడ్చర్లపల్లి, నాగారం వద్ద రోడ్లపై నీరు తగ్గలేదు. దీంతో చీకుపల్లికి అవతల ఉన్న 32 గ్రామాలకు రాకపోకలు లేవు. అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు పడవల ద్వారానే ప్రయాణం సాగించారు. భద్రాచలం నుంచి కూనవరం రహ దారిలో మురుమూరు, పోచారం వంటి చోట్ల రహదారులపై నుంచి వరద నీరు విడవ లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణానికి తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. భద్రాచలం పట్టణంలోని రామాలయం వీధులు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విస్తా కాంప్లెక్స్‌ను వరద నీరు విడవలేదు. అదే విధంగా రామాలయం పడమర మెట్లకు ఎదురుగా ఉన్న ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. అన్నదానం సత్రం కూడా వరద నీటిలోనే మునిగి ఉంది. రామాలయం నుంచి పంచాయతీ కార్యాలయానికి వచ్చే రహదారిపై నీరు తగ్గినప్పటికీ ఒండ్రు మట్టి చేరటంతో బురదమయంగా తయారైంది. ముంపు తగ్గక పోవటంతో చప్టా దిగువకు చెందిన ఇళ్ల వారు తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. సుభాష్ నగర్‌లో నీరు తగ్గినప్పటికీ బురదగా ఉండటంతో సాయంత్రం తరువాత పునరావాస శిబిరాలను నుంచి ఇళ్లకు పయనమయ్యారు.
విజృంభిస్తున్న వ్యాధులు
వరద ఉధృతి తగ్గినప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. నాలుగు రోజుల పాటు వరద నీరు నిల్వ ఉండటంతో చెత్త, పంటలు ఇతర వ్యర్థ పదార్థాలు కుళ్లిపోయి దుర్గంధం వ స్తోంది. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంచాయతీ అధికారులు బ్లీచింగ్ చల్లకపోవటంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. దుమ్ముగూడెం, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి.
పునరావాస కేంద్రాల్లో ఇక్కట్లు
పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేక వరదబాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల, తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వెలుతురు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పట్టణంలో ఉన్న పునరావాస శిబిరాల్లో స్వచ్ఛంద సంస్థల వారు అందిస్తున్న భోజనం తప్ప ప్రభుత్వపరంగా తగిన సహాయం అందించడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో భోజనాల కోసం బాధితులు గిన్నెలు పట్టుకొని నెట్టుకుంటున్నారు. తానీషా కల్యాణ మండ పంలో అయితే గర్భిణులు, ముసలి వాళ్లు భోజనం కోసం లైన్లలో నిలబడ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వరద బాధితులు గోడును పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి.
గోదారి శాంతించినా.. వీడని కష్టాలు
Published Wed, Aug 7 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement