ప్రజల సొమ్ము కాపాడతాం
తిరుపతి రూరల్: ప్రజాధనాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు చెవిరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కమిటీ చైర్మన్ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ ప్రథమ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతిపైసా చాలా విలువైందన్నారు.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతిపనిని నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, అంచనాల రూపక ల్పనలో అవినీతి జరగకుండా ప్రజల సొమ్ముకు రక్షణగా నిలుస్తామన్నారు. ప్రజల సొమ్మును కాపాడుతూనే అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధ్యయనం చేస్తామన్నారు. ప్రజలకు చెందిన ప్రతిపైసాను కాపాడేందుకు ప్రతి శాఖలో కూడా క్షేత్రస్థాయిలో సమీక్షలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈ నెల 29న హైదరాబాద్‌లో ఉద్యానవనశాఖ సీనియర్ అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.