అందరూ నావాళ్లే | Y.S jagan mohan reddy Aim to bring Y.S rajashekar reddy government | Sakshi
Sakshi News home page

అందరూ నావాళ్లే

Published Thu, Feb 27 2014 2:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అందరూ నావాళ్లే - Sakshi

అందరూ నావాళ్లే

రాజన్న రాజ్యం తేవడమే వైఎస్సార్ సీపీ ధ్యేయం
 పార్టీ తెలంగాణ, సీమాంధ్రలోనూ ఉంటుంది
 రాష్ట్రాన్ని విడగొట్టారు కానీ.. తెలుగువారి ఆప్యాయతలను విడగొట్టలేరు
 విశ్వసనీయతను చూసి ఓట్లేయమని అడుగుతాం
 ఇచ్చిన మాట కోసం తెలంగాణలో ఓదార్పుయాత్ర చేయబోతున్నా
 ఎన్నికల షెడ్యూలు వెలువడి వీలుకాని పక్షంలో నా తల్లి, చెల్లి ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు
 ఓదార్పు యాత్రలో పేదల కష్టాలు చూశాను..
వాటిని పరిష్కరించే దిశగా ప్లీనరీ వేదికగా  పలు హామీలిచ్చాను
 ఆ హామీల కోసం నా జీవితం ధారపోస్తాను

 
 
 సాక్షి, హైదరాబాద్: రాజన్న రాజ్యం కోసం కృషి చేసే తమ పార్టీ అన్ని ప్రాంతాల్లోనూ ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతి పేదవాడి మనసు తెలుసుకుని వారి గుండెల్లో నిలిచిపోయే రీతిలో పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘‘రాష్ట్రాన్ని విడగొట్టారు. భూమిని విడగొట్టారు. కానీ తెలుగుజాతిని విడదీయలేరు. తెలుగువారు ఎక్కడున్నా వారి మనసులు, వారి ఆప్యాయతలను విడగొట్టలేరు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ... అక్కడా ఇక్కడా అన్ని చోట్లా నా అన్నదమ్ములున్నారు.
 
 
 అక్కచెల్లెళ్లున్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా నాది అన్న భావనే సమైక్యం. ఆప్యాయతలు అక్కడా ఇక్కడా అన్ని చోట్లా ఉన్నాయని చెప్పడమే నా అభిప్రాయం. ఇదే నినాదంతో తెలంగాణలోకి వెళతాం. తెలంగాణలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఉంటుంది’’ అని వివరించారు. త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేయడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రెండు రోజుల చర్చా వేదికలో జగన్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేశారు. ‘‘తెలంగాణలోనూ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని పార్టీ శ్రేణుల్లోనూ విశ్వాసం నింపుతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా తెలంగాణలో ఓదార్పుయాత్ర చేయబోతున్నాను’’ అని చెప్పారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 మనమిచ్చే ఆక్సిజన్‌తోనే ప్రధాని బతకాలి!

 ‘‘వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకునే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. మనమిచ్చే ఆక్సిజన్‌తోనే కేంద్రంలో ప్రధాని పదవిలో ఉండేవాళ్లు బతికే పరిస్థితులు తీసుకురావాలి. సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆయనకు ఒకటే చెబుతున్నాను. అయ్యా.. ప్రధానమంత్రి మన ఆక్సిజన్‌తో బతికే పరిస్థితి వచ్చినప్పుడు.. మనకు డబ్బులు వచ్చినప్పుడు.. నువ్వే అవసరం లేదు.. ఎవరైనా ఆ పని చేయగలుగుతారు. తెలుగువారమంతా ఒక్కటై కచ్చితంగా ఆ పరిస్థితి తీసుకురావాలి. రాజకీయంగా ఇది చాలా అవసరం.
 
 ఓదార్పు యాత్రలో షర్మిల, విజయమ్మ ఉంటారు..

 తెలంగాణ ప్రాంతంలో నేను ఓదార్పు యాత్ర చేస్తాను. ఓదార్పు యాత్రలో నా చెల్లి షర్మిల, నా తల్లి విజయమ్మను భాగస్వాములను చేస్తాను. కారణమేమిటంటే.. నా తల్లికి, చెల్లికి పేదవాడు ఎలా బతుకుతున్నాడని అవగాహన కలగాలి. చనిపోయిన తర్వాత కూడా ఆ పేదవాడి గుండెల్లో బతికి ఉండడం ఎలా అనే ఆలోచన వాళ్లకు కలగాలి. ఒకవేళ ఎన్నికల షెడ్యూలు వెలువడి నేను సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించాల్సి వస్తే కూడా యాత్ర ఆపను. నాతల్లి, చెల్లి తెలంగాణలో ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు. ఎవరి జీవితంలోనైనా వెనుక కొందరున్నారంటారు. నా జీవితంలో కూడా నా తల్లి, నా చెల్లి, నా భార్య ఈ ముగ్గురూ ఉన్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాను. తెలంగాణలో ప్రతి కార్యకర్తకు కూడా భరోసా ఇస్తూ చెబుతున్నాను.. మన పార్టీ ఎక్కడికీ పోదు.. తెలంగాణలో కూడా మన కుటుంబం ఉంటుంది.
 
 ప్రతి నాయకుడూ పేదల కష్టాలు తెలుసుకోవాలి..

 బహుశా ఏ రాజకీయ నాయకుడికీ రాని అవకాశం నాకు వచ్చింది. ఓదార్పు సందర్భంగా పేదల ఇళ్లకు వెళ్లి  వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నాను. సాధారణంగా ఏ నాయకుడైనా ఒక మండల  కేంద్రం వరకూ వెళ్లి అక్కడే ఒక సభలో మాట్లాడి బైబై, టాటా అని వెళ్లడం అలవాటు. నేను దాదాపు 700 కుటుంబాలను కలిశాను. వారి కష్టాలు తెలుసుకున్నాను. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావాలనుకునే ప్రతి నాయకుడూ ఇలాంటి పరీక్షకు సిద్ధపడాలి. పేదల పూరిగుడిసెలకు వెళ్లి వారి జీవితాలను తెలుసుకుని ఏ విధంగా వారిని బాగు చేయవచ్చనే తలంపుతో పని చేయాలి.
 
 ఇదేనా ఆ పార్టీల విధానం?

 రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ; కేంద్రంలో కూడా అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ.. ఈ నాలుగూ కుమ్మక్కయి దారుణంగా వ్యవహరించాయి. రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని బీజేపీ చెప్పింది. టీడీపీ చెప్పింది. కానీ పార్లమెంటులో ఈ రెండు పార్టీలూ విభజన బిల్లుకు మద్దతు పలికాయి. ఇదెక్కడి విధానం? అన్యాయంగా విభజన జరుగుతోందని చంద్రబాబు ఓవైపు చెప్పి మరోవైపు వాళ్ల ఎంపీల చేత బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టి గతంలో ఎక్కడా లేని విధంగా సీమాంధ్ర ఎంపీలందరినీ సస్పెండ్ చేసి మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు.
 
 అందుకే కలసి ఉండాలన్నాం..

 మహానగరం, మహా సముద్రం కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, నౌకాశ్రయం, విమానాశ్రయం రెండూ కలసి ఉంటేనే తెలుగు జాతికి మేలు జరుగుతుందని భావించాం. 42 మంది లోక్‌సభ సభ్యులుంటే.. కేంద్రంతో గట్టిగా పోరాటం చేసి పెద్ద ప్రాజెక్టులను మన రాష్ట్రానికి తీసుకువచ్చి గుజరాత్ వంటి రాష్ర్టంతో పోటీపడి దేశంలోనే అగ్రగామిగా ఉంచొచ్చని ఆశించాం. అందుకే రాష్ట్రం ఒకటిగా ఉండాలని తాపత్రయపడ్డాం. అందుకోసం అలుపెరుగని పోరాటం చేశాం. కానీ అధికార, ప్రతిపక్షాలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కలసిపోవడంతో ఈ రాష్ట్రాన్ని ఒకటిగా కలిపి ఉంచలేకపోయాం.
 
 నా మీద నమ్మకంతో ఓట్లేయాలని అడుగుతాను..

 పేదల జీవితాలను చూశాను కనుకనే వారి సంక్షేమం కోసం కొన్ని పథకాలకు రూపకల్పన చేసి ప్లీనరీలో ప్రకటించాం. మన ప్లీనరీలో ఇచ్చిన హామీల కోసం నా జీవితాన్ని ధారపోస్తాను. రాజకీయాల్లో ఎవరైనా మా నాయకుడు ఫలానా జగన్‌లా ఉండాలి అనిపించుకునే విధంగా పనిచేస్తాను.
 
 
 నేను ఏ రోజూ సీమాంధ్రకు వెళ్లి తెలంగాణను ద్వేషించే విధంగా మాట్లాడలేదు. తెలంగాణకు వెళ్లి సీమాంధ్ర వారిపై రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నాయకుడు అనేవాడు ఏ ప్రాంతంలోకి వెళ్లయినా.. నన్ను చూసి ఓట్లేయండి.. నామీద నమ్మకం ఉంచండి అని చెప్పగలగాలి. నన్ను, నా విశ్వసనీయతను చూసి ఓట్లేయమని అడుగుతాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ ఉంటుంది. రాజన్న సంక్షేమ రాజ్య స్థాపనే మన ధ్యేయం.’’
 
 
 విడగొట్టాం కనుక  ఓట్లేయమంటున్నారు..

 ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన భావోద్వేగ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికలకు వెళుతున్నాం. ఇక్కడ పార్టీల తీరుచూస్తుంటే.. ‘రేషన్ కార్డులిచ్చాం.. ఇల్లులిచ్చాం.. అభివృద్ధి చేశాం... ఫలానా మంచిపని చేశాం.. ఓట్లు వేయండి’ అని వారు ఓట్లు అడిగే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని విడగొట్టి ఆ భావోద్వేగాలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘రాష్ట్రాన్ని విడగొట్టిన పెద్దమ్మను నేను.. నాకు ఓట్లేయండి..’ అని ఒకరు, ‘రాష్ట్ర విభజనలో నా పాత్రా ఉంది.. చిన్నమ్మను నేను.. నాకు ఓట్లేయండి’ అని మరొకరు ఓట్లు అడిగే పరిస్థితిని చూస్తున్నాం. రాష్ట్రాన్ని విడగొట్టాం కాబట్టి పొత్తు లేదా విలీనం చేయండని మరొకరు అడిగే పరిస్థితి. ‘నేనిచ్చిన లేఖ వల్లే రాష్ట్రాన్ని విడగొట్టారు కనుక ఒక ప్రాంతంలో విజయోత్సవాలు చేసుకోండి’ అని నిస్సిగ్గుగా చెప్పి భావోద్వేగాలను రెచ్చగొట్టేవారు ఇంకొకరు. మళ్లీ చంద్రన్న రాజ్యం తెస్తాన ని ధైర్యంగా చెప్పలేని స్థితిలో చంద్రబాబున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement