చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతున్న రహదారుల దిగ్బంధం
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రహదారుల దిగ్బంధం జరుగుతుంది. జిల్లాలోని పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాంతో రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే పుత్తూరులో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నేతృత్వంలో చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
శ్రీకాళహస్తిలోని బియ్యపు మధుసూధన్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దాంతో నెల్లూరు - తిరుపతి నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణవనంలో ఆ పార్టీ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో జాతీయ రహదారిపై దిగ్బంధం కార్యక్రమం జరిగింది. దీంతో కడప-చెన్నై రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
చిత్తూరు ఇంఛార్జ్ ఏ.ఎస్.మనోహర్ ఆధ్వర్యంలో బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై ధర్నాతో భారీగా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వరంలో రహదారుల దిగ్బంధం కొనసాగుతుంది.