ఏపీ అప్పు రూ. 2.16 లక్షల కోట్లకు పెరుగుతుంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని, వృథా ఖర్చులు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017-18 సంవత్సరానికి ఏపీ అప్పు రూ. 2.16 లక్షల కోట్లకు పెరగనుందని చెప్పారు.
నాసిరకం బొగ్గు కొనుగోలు చేయడం వల్ల జెన్‌కోకు నష్టం వాటిల్లిందని చెప్పారు. విద్యుత్ వ్యవస్థలోని లోపాలను కాగ్ బయట పెట్టిందని వెల్లడించారు. అయినా, విద్యుత్ రంగంలో అవార్డులు పొందామని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని బుగ్గన అన్నారు. బడ్జెట్ మేనేజ్‌మెంట్ అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. పాత పీడీ అకౌంట్లు క్లోజ్ చేయకుండా కొత్త పీడీ అకౌంట్లు ప్రారంభించారని కాగ్ ఆక్షేపించిన విషయాన్ని బుగ్గన తెలిపారు. హెలికాప్టర్ అద్దెలోనూ దుబారా చేశారని, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ రూ.14.37 కోట్లు అదనంగా ఇచ్చారని చెప్పారు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునేటప్పుడు సరైన ప్రమాణాలు పాటించలేదని కాగ్ తప్పులు ఎత్తి చూపిందన్నారు. పూర్తి సమయం హెలికాప్టర్ తిరగకుండా అద్దెలు చెల్లించిన విషయాన్ని కాగ్ స్పష్టం చేసిందని బుగ్గన వివరించారు.
రాజధాని విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని దేశాలు తిరిగి.. చివరకు సినిమా సెట్టింగ్స్ దగ్గర ఆగిందన్నారు. ఎన్సీఈఆర్ రిపోర్ట్ చూస్తే అవినీతిలో ఏపీ నెం.1 అని తేలిందని బుగ్గన గుర్తు చేశారు. చివరకు చంద్రబాబు, మరో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ చదవినట్టుగా టీడీపీ నేతలు భ్రమల్లో ఉన్నారని, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా చంద్రబాబు చదివిన యూనివర్శిటీలోనే చదివారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారన్నారు. పెద్దిరెడ్డి ఏనాడూ తన పేరుకు ముందు డాక్టర్ అని తగిలించుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చాలా వాగ్ధానాలు ఇచ్చారని, నెరవేర్చలేని వాగ్ధానాలపై ఆయన ప్రజల ముందు ఒప్పుకోవాలన్నారు. సరైన పరిపాలన అందించటం ద్వారా ప్రజల మనస్సు చూరగొనాలని బుగ్గన సూచించారు. ఆర్భాటాలకు పోకుండా పాలన కొనసాగించాలని చెప్పారు.