తిరుపతి: చంద్రగిరి-తిరుపతి మధ్య మార్గంలోని కాలూరు క్రాస్ వద్ద బుధవారం జరిగిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన జరీనా బేగం సరైన వైద్యం అందక చెన్నైలో నరక యాతన అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె చెన్నై లోని కీలపాకం మెడికల్ కాలేజ్ ఇనిస్టిట్యూట్ (కెఎంసీ) లో చికిత్స పొందుతోంది. అయినా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా జరీనాబేగం వాంగ్మూలం నమోదు చేసేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని పోలీసులు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడుతున్నారు.
కాగా జరీనాబేగంకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినా అధికారులు వాటిని ఖాతరు చేయలేదు. దాడిలో జరిగిన తర్వాత అత్యసవర చికిత్స కోసం జరీనా బేగంను రుయా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. దాంతో ఆమెను అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ కూడా వైద్యం చేయలేమని డాక్టర్లు చెప్పడంతో చెన్నైకి తరలించారు. అక్కడ అపోలో అసుపత్రిలో జరీనా బేగంకు చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. దాంతో ఆమె ప్రస్తుతం కెంఎంసీలో చికిత్స పొందుతోంది.