కేవలం కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వాహన యజమానులకు నిర్వహణ వ్యయం తగ్గించి అధిక లాభాలిచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. తమ ఇంజనీర్లలో అత్యధిక శాతం దీనిపైనే కృషి చేస్తున్నట్లు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ హెడ్ గిరీష్ వాఘ్ చెప్పారు. విజయవాడకు వచ్చిన వాఘ్ కొత్తగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల విషయాలతో పాటు, దేశీయ వాహనరంగ వృద్ధి, విస్తరణ వంటి పలు అంశాలను ‘సాక్షి’కి వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇవీ... – సాక్షి, అమరావతి
దేశీ వాణిజ్య వాహన రంగం ఎలా ఉంది? కోలుకుంటున్న సంకేతాలున్నాయా?
గడచిన ఏడాదిన్నరగా ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. పెద్ద నోట్ల రద్దు, బీఎస్4 నిబంధనలు, జీఎస్‌టీ అమలుతో పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. జీఎస్‌టీ తర్వాత జూలై నుంచి అమ్మకాలు బాగున్నాయి. పరిశ్రమ సగటు వృద్ధిరేటు కంటే టాటా మోటార్స్ అధిక వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ వాటా బాగా పెరిగింది. దేశంలో ఏటా 7 లక్షల వాణిజ్య వాహనాలు అమ్ముడవుతున్నాయి.
ఇందులో 46 శాతం వాటా టాటా మోటార్స్‌దే. ఈ ఏడాది ఈ అమ్మకాల వృద్ధి 8–9 శాతం ఉండొచ్చు. వచ్చే రెండేళ్లలో పరిశ్రమ వృద్ధి బాగుంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి. భారత్ మాలా, సాగర్ మాలా, నదుల అనుసంధానం ప్రాజెక్టులకు తోడు బ్యాంకులకు మూలధనం సమకూర్చడం వల్ల వచ్చే 18 నుంచి 24 నెలలు వాణిజ్య వాహనాల అమ్మకాలు బాగుంటుంటాయని అంచనా వేస్తున్నాం. స్వచ్ఛ భారత్ వల్ల కూడా చిన్న స్థాయి వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి.
బస్సులు, ఆటోలు వంటి ప్యాసింజర్ వాహనాల అమ్మకాల సంగతో..?
బస్సులనేవి ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల కొనుగోళ్లపై, ఆటోల విక్రయాలు వాటికి రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే పర్మిట్లపై ఆధారపడి ఉంటాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 40% వాటా రోడ్డు రవాణా సంస్థలదే. ఈ ఏడాది ఒక్క మహారాష్ట్ర తప్ప మిగిలిన రాష్ట్రాల నుంచి కొత్త బస్సులకు ఆర్డర్లు లేవు. దీంతో ఈ రంగం నెగటివ్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా చూస్తే మౌలికరంగంపై పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యయం చేస్తుండటం, వినిమయశక్తి పెరగడంతో మధ్య స్థాయి, భారీ, స్మాల్ అండ్ లైట్ పికప్ వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సుల వంటి వాహనాలకు వస్తే కొన్నాళ్లు వేచి చూడాలి.
ఇప్పుడిప్పుడే బీఎస్4 నిబంధనలకు అలవాటు పడుతున్న పరిశ్రమ 2020 నుంచి అమల్లోకి వచ్చే బీఎస్6 నిబంధనలకు సిద్ధంగా ఉందా?
కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వాహనాల నిర్వహణ వ్యయం తగ్గించడం ద్వారా లారీ యజమానులకు అధికాదాయం వచ్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్4 వాహనాల్లో ఈ విధానాన్నే అనుసరించాం. బీఎస్6 నిబంధనల్లో కూడా నిర్వహణ వ్యయం మరింత తగ్గించడంపై దృష్టి సారిస్తున్నాం.
మా ఇంజనీర్లలో అత్యధికశాతం మంది బీఎస్6 టెక్నాలజీని అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెట్టారు. అదే విధంగా ఏటా రూ.1,500 కోట్ల చొప్పున మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయనున్న మొత్తంలో కూడా అత్యధికభాగం బీఎస్6కే కేటాయిస్తున్నాం. ఈ ఏడాది విడుదల చేసిన మోడల్స్ అన్నీ బీఎస్4 నిబంధనలకు అనుగుణంగా ఉన్నవే. త్వరలోనే సిగ్నా రేంజ్‌లో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నాం.
ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వాహనాలపై చర్చ జరుగుతోంది.. మీ ప్రణాళికలేంటి?
ఎలక్ట్రికల్ బస్సుల తయారీలో టాటా మోటార్స్ ముందంజలో ఉందని చెప్పగలను. ఇప్పటికే స్టార్‌బస్ పేరుతో 9 మీటర్లు, 12 మీటర్ల బస్సులను అభివృద్ధి చేశాం. కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి విజయం సాధించగా, మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు చేస్తున్నాం. ఒక్కసారి ఆర్డర్లు వస్తే విక్రయాలకు సిద్ధంగా ఉన్నాం. డీజిల్, ఎలక్ట్రిక్‌తో నడిచే హైబ్రిడ్ బస్సులను కూడా సిద్ధం చేశాం. ఎంఎంఆర్‌డీఏ (ముంబై) నుంచి 25 హైబ్రిడ్ బస్సులకు ఆర్డరు రాగా ఇప్పటికే 15 బస్సులను సరఫరా చేశాం.
వీటిని త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపైనా దృష్టి సారిస్తున్నాం. ఇస్రో సహకారంతో ఫ్యూయల్ సెల్ బస్‌లపై దృష్టి పెట్టాం. హైడ్రోజన్‌తో నడిచే ఈ ఫ్యూయల్ సెల్‌కు సంబంధించి నమూనా సిద్ధంగా ఉంది. దీనిని గత ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించాం. వీటితో పాటు సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ వాహనాలపై కూడా దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వాహనాలు రీచార్జ్ చేయాల్సి ఉండటంతో షార్ట్ రూట్, నిర్దేశించిన రూట్లలో మాత్రమే నడపగలం. 7 సీటర్ ఆటోలైన మ్యూజిక్ ఐరిస్‌లో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లను సిద్ధం చేశాం. భారీ వాణిజ్య వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి చాలా సమయం పడుతుంది.
ఇక్కడ తయారీ యూనిట్‌ను పెట్టే అవకాశం ఉందా?
ప్రస్తుతం టాటా మోటార్స్‌కు దేశంలో 5 తయారీ యూనిట్లు, మూడు బాడీ బిల్డింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ఉత్పత్తిలో 70 శాతం మాత్రమే వినియోగిస్తున్నాం. దీంతో ప్రస్తుతానికి కొత్తగా ఎక్కడా తయారీ యూనిట్లు పెట్టే ఆలోచన లేదు. వ్యాపార పరంగా ఏపీ మాకు కీలకమైన రాష్ట్రం. కొత్త యూనిట్‌ను పెట్టే ఆలోచన ఉంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment