గూగుల్ ‘పిక్సల్’ స్మార్ట్ఫోన్లు
• సొంత బ్రాండ్‌పై తొలిసారిగా విడుదల
• ధర రూ.57 వేల నుంచి...
• 13 నుంచి బుకింగ్
శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ ప్రపంచ దిగ్గజం గూగుల్ తొలిసారిగా గూగుల్ బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్ పేరుతో రెండు మోడళ్లను తీసుకొచ్చింది. మంగళవారం ఇక్కడ స్మార్ట్ ఫోన్లతోపాటు పలు ఇతర గ్యాడ్జెట్లను(వీఆర్ హెడ్‌సెట్, క్రోమ్‌కాస్ట్ అల్ట్రా, హోమ్ స్పీకర్లు) కూడా విడుదల చేసింది. గూగుల్ పిక్సల్ 5 అంగుళాల స్క్రీన్‌తో, పిక్సల్ ఎక్స్‌ఎల్ మోడల్ 5.5 అంగుళాల స్క్రీన్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ‘ఆండ్రాయిడ్ నుగట్ 7.1’ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. 32జీబీ, 128జీబీ వర్షన్లలో లభిస్తాయి. 12 మెగా పిక్సల్ ఎఫ్/2.0 అపెర్చర్ కెమెరాను వెనుక భాగంలో అమర్చారు.
వెనుక భాగంలో హైఎండ్ అల్యూమినియం కేస్‌తో వస్తుంది. బ్లాక్, సిల్వర్, బ్లూ రంగుల్లో లభ్యం. సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్లు తెరవెనుక ఆటోమేటిక్‌గా జరిగిపోతుండడం ఇందులోని సౌలభ్యం. కేవలం 15 నిమిషాల్లోనే 7 గంటలకు సరిపడా పవర్ చార్జ్ అవుతుంది. అమెరికాలో వీటి ధర 649 డాలర్లు. భారత మార్కెట్లో ఈ ఫోన్లకు ముందస్తు బుకింగ్‌లు ఈ నెల 13 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెల 20 నుంచి అందుబాటులోకి వస్తాయి. దేశీ మార్కెట్లో పిక్సల్ మోడల్ ధర సుమారు రూ.57వేలు.
ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ దుకాణాల్లో లభ్యం: ఈ ఫోన్లను ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా గూగుల్ విక్రయించనుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ సేల్స్ తదితరసంస్థలకు చెందిన సుమారు వెయ్యికి పైగా దుకాణాల్లో అందుబాటులో ఉంటాయి. గూగుల్ తొలుత ఆరు దేశాల్లో పిక్సల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తుండగా అందులో భారత్ కూడా ఉంది.