ఈక్విటీల్లో ఇవి ఉండాల్సిందే..
స్టాక్ సూచీలు నూతన గరిష్ట స్థాయిలను దాటి దూసుకుపోతున్న తరుణంలో షేర్ల పెట్టుబడిలో ఉండే లాభనష్టాలు, ఇన్వెస్ట్ చేసే ముందు పాటించాల్సిన నియమాలతో పాటు, ప్రస్తుత ర్యాలీలో ఏ రంగాల షేర్లు పెరిగే అవకాశం ఉందన్న దానిపై ఐఐఎఫ్‌ఎల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ సీఐవో ఉమాంగ్ సలహాలు,సూచనలు ప్రత్యేకంగా ‘ప్రాఫిట్’ పాఠకుల కోసం ...
సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రంలో ఏక పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారం చేపట్టడంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా కీలకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టే అవకాశం ఏర్పడింది. ఈ అంశమే విదేశీ ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. గత రెండేళ్లలో ఎఫ్‌ఐఐలు సగటున ఏడాదికి 22 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ ఏడాది జూన్ 18 నాటికే 10 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు.
అలాగే గత రెండేళ్లుగా తగ్గిన దేశీయ పొదుపు రేటు తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు కూడా స్టాక్ మార్కెట్లోకి కొత్త నిధుల ప్రవాహాన్ని సూచిస్తున్నాయి. రానున్న కాలంలో స్టాక్ మార్కెట్లు మరింత పైకి ఎదిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈక్విటీలు మంచి లాభాలను అందిస్తాయనే అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం...
మిడ్‌క్యాప్‌దే జోరు
ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతున్నప్పుడు మిడ్, స్మాల్ క్యాప్ విభాగంలో మంచి కంపెనీల షేర్లు అత్యధికంగా లాభపడతాయి. సహజంగా పెరుగుతున్న వృద్ధిరేటుతో పాటే ఈ కంపెనీల వ్యాపార, ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. వాటి భవిష్యత్తు ఆదాయాలు, లాభాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీల షేర్ల ధరల రీ-రేటింగ్ జరుగుతుంది. బుల్ మార్కెట్ ర్యాలీలో లార్జ్ క్యాప్ షేర్ల కంటే మిడ్ క్యాప్ షేర్లే ఎక్కువ లాభాలను అందిస్తాయి. ఉదాహరణకు గత బుల్ ర్యాలీనే పరిశీలిస్తే... 2003-2007లో నిఫ్టీ 47 శాతం పెరిగితే నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 55 శాతం వార్షిక వృద్ధిరేటును అందించింది. కాబట్టి మిడ్, స్మాల్ క్యాప్ విభాగంలో మంచి కంపెనీల షేర్లు తప్పకుండా మీ పోర్ట్‌ఫోలియోలో ఉండే విధంగా చూసుకోవాలి
అదే బాటలో సైక్లికల్స్
బుల్ ర్యాలీలో మంచి పనితీరు కనపర్చే వాటిల్లో సైక్లికల్స్ అంటే.. క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా రంగాలు ఉంటాయి. వృద్ధిరేటు మందగించడంతో ఈ రంగాలకు చెందిన కంపెనీల ఆదాయం 40 -60% పడిపోయింది. దీంతో ఈ షేర్లు వాటి సగటు ట్రేడింగ్ స్థాయి కంటే చాలా చౌక ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే ముందుగా పెరిగేది ఈ సైక్లికల్సే కాబట్టి వీటిపై ఓ కన్నేసి ఉంచాలి.
పీఎస్‌యూలదే భవిష్యత్తు
ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సంస్కరణల్లో మొదటి ప్రాధాన్యత పీఎస్‌యూలను సంస్కరించడమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా పీఎస్‌యూలను ఆయన గాడిలో పెట్టిన విషయం తెలిసిందే. సరైన నిర్వహణ సామర్థ్యం లేక చాలా పీఎస్‌యూ కంపెనీలు పూర్తిస్థాయిలో లాభాలను పొందలేకపోతున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన 81 ప్రభుత్వరంగ కంపెనీల పదేళ్ల సగటు లాభాలు 12.5 శాతంగా ఉంటే ఇదే సమయంలో బీఎస్‌ఈలోని టాప్ 100 కంపెనీల సగటు లాభాలు 19.2%గా ఉన్నాయి. బ్యాంకులను మినహాయిస్తే 52 పీఎస్‌యూల సగటు లాభాలు 9.8 శాతం. పీఎస్‌యూలు రానున్న కాలంలో మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుత బుల్ ర్యాలీలో మిగిలిన వాటికంటే ఈ మూడు రంగాలు మరింత మెరుగైన పనితీరును కనపర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అని మీ మొత్తం పెట్టుబడి అంతా ఈ మూడింటికే కేటాయించడం మంచిది కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు కేవలం ఒకే రంగానికి కాకుండా అన్ని రంగాలకు కేటాయించే విధంగా చూసుకోవాలి. అందులో కొద్దిగా అధిక భాగం ఈ మూడింటికి కేటాయించడం ద్వారా రిస్క్ తగ్గించుకొని అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆర్థిక వృద్ధికి దోహదం చేసే రంగాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఎంచుకోండి.