ఈ ఏడాది 1.5 లక్షల ఐటీ కొలువులు
♦ భారీ తొలగింపు వార్తలను ఖండించిన నాస్కామ్
♦ ఐటీ రంగంలో కొనసాగాలంటే నైపుణ్యాలను పెంచుకోవాల్సిందే: చంద్రశేఖర్
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులంటూ వస్తున్న వార్తలను సాఫ్ట్‌వేర్ కంపెనీల అసోసియేషన్ (నాస్కామ్) తోసిపుచ్చింది. ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందిని ఈ రంగం భర్తీ చేసుకోనుందని తెలిపింది. టెక్కీలు ఐటీ పరిశ్రమలో కొనసాగాలనుకుంటే మాత్రం తమ నైపుణ్యాలను మెరుగుదిద్దుకోవాల్సిందేనని సూచించింది. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజంట్ తదితర కంపెనీలు ఈ ఏడాది 50,000 మందిని తొలగించనున్నట్టు ఇటీవల వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మేము ఈ వార్తలను చాలా స్పష్టంగా ఖండిస్తున్నాం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో నికరంగా 1.7 లక్షల మంది ఉద్యోగాలు పొందారు.
ఒక్క నాలుగో త్రైమాసికం (2017 జనవరి–మార్చి)లోనే నికరంగా 50,000ని టాప్ 5 కంపెనీలు నియమించుకున్నాయి’’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విప్రో, కాగ్నిజంట్, మైండ్‌ట్రీ కంపెనీల ప్రతినిధులూ పాల్గొన్నారు. తమ సంఘంలో సభ్యులుగా ఉన్న వారిని సంప్రదించగా... ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందిని నియమించుకోనున్నట్టు చెప్పారని ఆయన వెల్లడించారు. ఆటోమేషన్, రోబోటిక్స్, అనలైటిక్స్, సైబర్ సెక్యూరిటీ తరహా కొత్త టెక్నాలజీల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న క్రమంలో ఉద్యోగులు తిరిగి నూతన నైపుణ్యాలను సంతరించుకోవాలని లేకుంటే మనుగడ సాగించలేరని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కొత్తగా 30 లక్షల ఉద్యోగాలు
టెక్ స్టార్టప్‌లు, ఈకామర్స్, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ వంటి కొత్త అవకాశాల నేపథ్యంలో 2025 నాటికి 30 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేస్తున్నామని చంద్రశేఖర్ చెప్పారు. ఏటా పనితీరు మదింపు అనంతరం కొంత మంది ఉద్యోగులను తొలగించడం అన్నది ఐటీ పరిశ్రమలో సహజంగా జరిగే ప్రక్రియ. ‘‘ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం భిన్నంగా ఏమీ ఉండదు. పనితీరు ఆధారంగా ఉద్యోగుల్లో మార్పుల వల్ల 0.5% నుంచి 3% వరకు ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’ అని చంద్రశేఖర్ వివరించారు. ఉద్యోగులకు శిక్షణ, కొత్త టెక్నాలజీలపై నైపుణ్య సాధన కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని నాస్కామ్ చైర్మన్ రామన్‌రాయ్ వెల్లడించారు.