న్యూఢిల్లీ: దిగుమతి చేసుకునే వస్తువులను స్థానికంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలతో తయారు చేయించేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ విషయంలో వాణిజ్య శాఖతో కలసి పనిచేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... ఎంఎస్‌ఎంఈ రంగం ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నట్టు చెప్పారు. దేశ వృద్ధి కోసం చిన్న తరహా సంస్థలకు మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘దిగుమతి చేసుకునే వస్తువుల్లో వేటిని స్థానికంగా చిన్న తరహా సంస్థలతో తయారు చేయించొచ్చు? అన్న విషయాన్ని వాణిజ్య శాఖతో కలసి అధ్యయనం చేయాలని ఆర్థిక సలహాదారుతోపాటు మా కార్యదర్శిని కోరాం’’అని గడ్కరీ చెప్పారు. ఈ విధంగా చేస్తే దిగుమతుల బిల్లును తగ్గించొచ్చన్నారు. గ్రామీణ ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు పల్లెల్లో ఉద్యోగాల కల్పనకు సూక్ష్మ యూనిట్లు, గ్రామీణ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారిస్తామని మంత్రి చెప్పారు. గ్రామీణంగా లభించే ఎన్నో ముడి సరుకులతో భిన్నమైన ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. చిన్న యూనిట్లు మూతపడడానికి కారణాలపై దృష్టి సారిస్తామన్నారు. దేశ ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈ రంగం 45 శాతం భర్తీ చేస్తోంది. అలాగే, జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతంకాగా, తయారీ ఉత్పత్తిలో 33 శాతం కూడా ఈ విభాగానిదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment