వాషింగ్టన్: కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చికిత్సపై ఆధారపడి జీవించే రోగులకు ఇక ఆ కష్టాలు తీరినట్టే. ఇలాంటి వారికోసం ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు పరిశోధకులు. తీవ్రమైన కిడ్నీవ్యాధితో బాధపడుతూ..రక్తశుద్ధి కోసం డయాలసిస్ చేయించుకునే పేషంట్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. వీటికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక కృత్రిమ కిడ్నీని రూపొందించింది. ప్రామాణిక డయాలసిస్ చికిత్సా పద్ధతికి స్వస్తి చెపుతూ నూతన సాంకేతిక పద్ధతితో ఆర్టిఫిషీయల్ కిడ్నీని తయారు చేశారు.
కన్వెన్షనల్ డయాలసిస్ లో మిషీన్ నడుస్తున్నంత సేపు ..పేషెంట్ మంచానికి పరిమితమై ఉండాలి... రకాల రకాల ట్యూబులతో రోగి శరీరానికి అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొత్తం ఒక రోజంతా నడుస్తుంది. కానీ ఈ ధరించడానికి వీలుగా రూపొందించిన ఈ కృత్రిమ కిడ్నీ మూలంగా....పేషెంట్ ఫ్రీగా తిరగొచ్చనీ, ట్యూబుల బాధ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. డయాలసిస్ సెషన్స్ ను తగ్గించవచ్చని, దీని ద్వారా అదనపు చికిత్స ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆహారం ఆంక్షలు లేకపోవడంతోపాటూ చికిత్స సమయంలో బాధల్నీ,తీవ్రమైన దుష్ప్రభావాలను నిరోధించినట్టు తెలిపారు.
ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ కృత్రిమ పరికరంద్వారా వ్యర్థ ఉత్పత్తులను, అదనపు నీరు, ఉప్పు లను సమర్ధవంతంగా తొలగించగలదని చెప్పారు. యూరియా, క్రియాటినిన్ మరియు భాస్వరం తదితర వ్యర్థాలను సాధారణం మూత్రపిండాల్లోలాగానే ఫిల్టర్ చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
లాస్ ఏంజిల్స్ లో సేడార్-సినై మెడికల్ సెంటర్ కు చెందిన విక్టర్ గురా దీన్ని ఆవిష్కరించారు. ధరించగలిగిన కృత్రిమ కిడ్నీ నమూనా పరికరాన్ని సీటెల్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ లో రోగులపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగ ఫలితాలను జేసీఐ ఇన్సైట్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తరహాలో వేరియబుల్ ఆర్టీఫిషియల్ కిడ్నీ ఆవిష్కరణ, దీని ప్రయోగ ఫలితాలు మరింత నూతన డయాలసిస్ టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇక డయాలసిస్ కష్టాలు తీరినట్టేనా?
Published Sat, Jun 4 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement