
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. కాగా ట్యాంక్ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే వారిలో ఏడుగురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరంతా మొరం గ్రామ సమీపానికి చెందినవారు. మృతులు రెడ్డప్ప, రమేష్, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజు శివగా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, ఏఎస్పీతో ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సాయం కింద జిల్లా సబ్ కలెక్టర్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment