
మల్హర్(మంథని) : ఇంకా నెలలు నిండని పసిగుడ్డును తల్లి గర్భంలోనే చిదిమేశారు. లోకం చూడకముందే పరలోకానికి పంపేచేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గర్భస్థ శిశువును మురికికాల్వలో పడేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్లలో శుక్రవారం వెలుగు చూసింది. తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని మురుగుకాల్వలో మృతశిశువు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆరు నెలల గర్భంలోనే శిశువును చిందిమేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతశిశువును పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ఆస్పత్రికి శిశువు మృతదేహాన్ని తరలించారు. కాగా పసికందు ఆడపిల్ల కావడంతో ఓ మహిళ గర్భం తొలిగించుకున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మండలంలోని వలెంకుంట శివారులోని బావిలో శిశువు మృతదేహాన్ని పడవేసిన ఘటన మరవకముందే మరో ఘటన చోటు దారుణం.