
సాక్షి, న్యూఢిల్లీ : ఓ ఎన్నారై యువకుడు అమెరికన్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ యువకుడు గూగుల్ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు తెలిసింది. తాజ్ ప్యాలెస్ హోటల్‌లోని తన రూమ్‌లో ఆ యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
ఈ నెల(జనవరి) 8న రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్మోల్ సింగ్ ఖర్బందా అనే 22 ఏళ్ల యువకుడు సదరు అమెరికన్ మహిళతో కలిసి హోటల్ బార్‌లోనే చాలా సేపు గడిపాడు. అనంతరం సిగరెట్ తాగేందుకు ఇద్దరు కలిసి అతడి గదిలోకి వెళ్లారు. ఆ సమయంలోనే అతడు ఆమెతో చెడుగా ప్రవర్తించాడు. చెప్పరాని విధంగా చేతులతో తడిమి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఆమె వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి జైపూర్ వెళ్లింది. తిరిగి వచ్చే సమయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేసింది.