
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియురాలితో ఫోన్‌లో గొడవపడి ప్రయాణిస్తున్న ఆటోలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు ఓ 24 ఏళ్ల యువకుడు. అతనితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రసుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి ఉత్తర ఢిల్లీలోని ఘాజియాబాద్‌కు చెందిన శివమ్(24), దగ్గరి బంధువైన అర్జున్‌తో కలిసి ఆటోలో తమ సోదరుడి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో భగవాన్ సింగ్(60) అనే మరో వ్యక్తి ఆటో ఎక్కాడు.
ఆటోలో ప్రయాణిస్తున్న శివమ్, కోల్‌కతాలో ఉన్న తన ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూ.. ఇద్దరు గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన శివమ్ వెంటనే తన బ్యాగులో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసి ఒంటిపై పోసుకొని లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. దీంతో ఆటోలో ఉన్న మరో ఇద్దరికి కూడా ఆ మంటలు తాకాయి. అప్రమత్తమైన ఆటో డ్రైవర్ ఆటో నిలిపి బయటకు దూకాడు. మంటలు ఆర్పి స్థానికుల సహాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగ శివమ్ శరీరం 70 శాతం మేర కాలిపోయిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. శివమ్‌పై ఆత్మహత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment