ఏటూరునాగారం : పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం మండపాక వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన 50 మంది కూలీలు కమలాపురం గ్రామానికి చెందిన కొమిరె బాబురావు డ్రైవర్, యజమాని అయిన బొలెరో వాహనంలో మండపాక మిరప కోతల కోసం ఓ రైతు పొలంలోకి వెళ్తున్నారు. ముల్లకట్ట బ్రిడ్జి దాటిన తర్వాత కూతవేటు దూరంలో వాహనం ముందు టైర్ పేలింది. వాహనంలో అధికలోడు ఉండడంతో వాహనం అదుపుకాలేదు. దీంతో ఒకవైపు బోల్తా పడింది. అందులో ఉన్న కూలీలు ఒకరిపై ఒకరు పడి రోడ్డుపై పడ్డారు.
దీంతో కాళ్లు, చేతులు, నడుముతోపాటు శరీరం నిండా గాయాలయ్యాయి. 50 మంది కూలీల్లో 5 గురికి ఎలాంటి గాయాలు కాలేదు. మిగతా 19 మందిని వరంగల్ ఎంజీఎం, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 20 మంది ఏటూరునాగారం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏజెన్సీ మండలాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి, రాజకీయ నాయకులు, పోలీసులు, గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. మూడు 108 వాహనాలు ఉండడంతో మిగతావారిని ప్రైవేటు వాహనాల్లో వరంగల్‌కు తరలించారు.
ఎంజీఎం, ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
మండపాక వద్ద బోల్తా పడిన బోలెరో వాహనంలో గాయపడిన 20 మందిని వరంగల్ ఎంజీఎంతో పాటు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కోరం అంజలి, కోరం జానకి, కోరం సత్తమ్మ, నక్కల లక్ష్మి, ముద్దబోయిన నర్సమ్మ, సాదం లక్ష్మి, కోరం సారమ్మ, దబ్బగట్ల లక్ష్మికాంత, నక్కల ఉప్పలయ్య, పూనెం యాకలక్ష్మి, గొగ్గళి స్వరూప, ఉడత ఎల్లమ్మ, జక్కుల కోమలత, ముద్దబోయిన సారమ్మ, పూనెం శిరీష, మెట్టు రజిత, చాట్ల పుష్పలత, కొత్తపల్లి లలిత, గోపు కవిత, బాసబోయిన మల్లమ్మ, దొండ సాలమ్మ, కోమటిరెడ్డి మణెమ్మలను ఆస్పత్రులకు 108లో తరలించారు.
చికిత్స పొందుతున్న వారు..
ధనసరి భవాని, ముద్దబోయిన సరస్వతి, ముద్దబోయిన నర్సమ్మ, దాసరి స్వరూప, దాసరి సంతోషా, దాసరి కవిత, కోరం హనుమంతు, పూనెం రమా, ముద్దబోయిన రమా, కోరం సమ్మక్క, నక్కల సత్యమ్మ, పూనెం సీత, ధనసరి సంధ్యారాణి, సిద్దబోయిన సాంబలక్ష్మి, పొన్నాల భాగ్యలక్ష్మి, కోరం సుధా, కోరం లక్ష్మి, దబ్బగట్ల సొంబాయి, చెరుకు హరిత, బండి విజయ, దొండ మల్లయ్యలు చికిత్స పొందుతున్నారు. కాగా పూనెం జయ, పూనెం రాములమ్మ, గొగ్గళి రేష్మ, ధనసరి సమ్మక్క, దబ్బగట్ల సౌజన్యకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు.
మృతి చెందిన ఐలయ్య, చంద్రమ్మ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
Comments
Please login to add a commentAdd a comment