సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో స్కాములకు పాల్పడిన హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ సీఈవో చిత్తూరు జిల్లా వాసి నౌహీరా షేక్‌పై తొలి అభియోగపత్రం(చార్జిషీట్)ను ఎకనమికల్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు ముంబైలో దాఖలు చేశా రు. అక్కడ నమోదైన రూ.500 కోట్ల కుంభకోణంపై ఈఓడబ్ల్యూ దర్యాప్తు పూర్తిచేసి బుధవారం ముంబై కోర్టులో 3వేల పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
డాక్టర్ నౌహీరాకు నో డాక్టరేట్
నౌహీరా అరెస్టు అయ్యే వరకూ డాక్టర్ నౌహీరాగానే చలామణి అయ్యారు. గత అక్టోబర్‌లో హైదరాబాద్ సెంట్రల్‌క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారులు ఈమెను తొలిసారిగా అరెస్టు చేసి విచారణ చేపట్టగా ఆ విచాణలో ఈమెకు డాక్టరేట్ లేదని తేల్చారు. తొలుత పీహెచ్‌డీ చేశానని చెప్పిన ఆ తర్వాత మాటమార్చి తన సేవలకు మెచ్చి దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈలోపు ముంబైలోనూ ఆమెపై కేసులు నమోదు కావడం, పీటీ వారంట్‌పై అక్కడకు తరలించడంతో తదుపరి విచారణను ఈఓడబ్ల్యూ చేపట్టింది. విచారణలో ఆమె తొమ్మిదో తరగతి వరకే చదివినట్లు తేలింది.
కూరగాయల దుకాణంతో మొదలైన ప్రస్థానం
చదువు మానేసిన నౌహీరా తన తల్లికి సహాయంగా కూరగాయల దుకాణం నడిపిన తర్వాత సొంతంగా పాత బట్టల క్రయవిక్రయాలు చేసింది. 1990ల్లో తొలిసారిగా మహిళలతో ఓ చిన్న గ్రూప్ ఏర్పాటు చేసిన ఆమె వివాహాది శుభకార్యాలకు బంగారం విక్రయించడం మొదలెట్టారు. 2008లో హైదరాబాద్‌కు మకాం మార్చి హీరా గ్రూప్ ఏర్పాటు చేయగా.. 2014 నాటికి ఈ గొడుగు కింద 17 సంస్థలు వచ్చి చేరాయి. వీటిలో నాలుగైదు సంస్థలకు ఆర్వీఐ సహా ఏ విభాగం నుంచీ అనుమతి లేకపోయినా డిపాజిట్లు సేకరించింది. సౌతాఫ్రికాలో బంగారు గనులు లీజు కు తీసుకున్నామని, పెట్టుబడులకు లాభాలే ఇస్తున్నానంటూ ప్రచారం చేసి అనేకమందిని ఆకర్షించిం ది. అయితే అదీ వాస్తవం కాదని, కొన్నాళ్లు ముంబైకి చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి బంగారం ఖరీదు చేసిందని, ఆపై అదీ మానేసినట్లు విచారణలో తేలింది. ముంబై కేంద్రంగా ఆమెతోపాటు ఆ గ్రూప్‌నకు 200 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ఈఓడబ్ల్యూ గుర్తించింది. వీటితో 75 ఖాతాల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించగా కేవలం రూ.17 కోట్లు లెక్కతేలింది. మిగిలిన మొత్తాన్ని ఎలా లావాదేవీలు చేశారనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు.
ఆస్తుల్ని గుర్తించిన పోలీసులు: సంస్థకు చెందిన రూ.40 కోట్ల విలువైన 6ఆస్తుల్ని గుర్తించిన ముంబై పోలీసులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో కోర్టు విచారణ ప్రారంభంకావాలంటే మరోసారి ఆమెను ముంబై కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారుల అదుపులో ఉంది. అక్కడి కేసుల విచారణ పూర్తయిన తర్వాత పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నౌహీరా స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని హీరా గ్రూప్ బాధితుల సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం నేత షాబాజ్ అహ్మద్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు.
నౌహీరా షేక్‌పై తొలి చార్జిషీట్
Published Fri, Jan 25 2019 12:03 AM | Last Updated on Fri, Jan 25 2019 12:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment