సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్ మాటున కొందరు సాగిస్తున్న ఆన్‌లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోసపూరిత మార్గాలను అనుసరించిన వ్యక్తుల నుంచి ఇసుకను, వాహనాలను స్వాదీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు బనాయించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా పూర్తి పారదర్శకంగా ఇసుకను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం విదితమే. అయితే, కొందరు దళారులు అక్రమార్జనే లక్ష్యంగా వేర్వేరు వ్యక్తులు, చిరునామాలతో ఐడీలు సృష్టించి పెద్ద పరిమాణంలో ఇసుక బుక్ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుక లోడుతో వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఇసుక బుకింగ్‌లో అక్రమాలు సాగుతున్న వైనం బట్టబయలైంది.
తప్పుడు ఐడీల స్కాన్ కాపీ
- గుంటూరుకు చెందిన బి.కిషోర్ అనే వ్యక్తి వేర్వేరు పేర్లతో గుంటూరులోని వేర్వేరు చిరునామాలతో, వేర్వేరు ఐడీ నంబర్లతో ఆన్‌లైన్ ద్వారా రూ.1.27 లక్షల విలువైన ఇసుక బల్క్ బుకింగ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను సీజ్ చేసి అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
- కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. బినామీ పేర్లతో రూ.3.80 లక్షల విలువైన ఇసుకను అతడు ఆన్‌లైన్‌లో బుక్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. మీ–సేవ కేంద్రం ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించి క్రిమినల్ కేసు నమోదు చేశారు.
దొరికిందిలా..
సబ్ ఇన్‌స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీను సిబ్బందితో కలిసి గన్నవరంలోని కొనాయి చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీని రోడ్డు పక్కన నిలిపేసి డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. గన్నవరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బొజ్జగాని వీరాస్వామి, దావాజీగూడెంలోని మసీదు ఎదురుగా ఉన్న ‘మీసేవ’ సెంటర్ ఆపరేటర్ సింగలపల్లి దుర్గారావు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఐపీ నంబర్లు సృష్టించి ఇసుక బుక్ చేసుకుని లారీలు, ట్రాక్టర్లలో తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని డ్రైవర్, క్లీనర్ అంగీకరించారు. ‘మీసేవ’ ఆపరేటర్ దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఇసుకను మోసపూరితంగా బుకింగ్ చేసినందుకు బ్రోకర్లు, లారీ యజమానుల నుంచి దుర్గారావు రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకు వసూలు చేసినట్లుగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment