పట్నా : బీహార్ రాజధాని పట్నా సమీపంలోని సైదాబాద్ ప్రాంతంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఒక ఆర్మీ జవాన్ తన పిల్లల కళ్ల ముందే కదులుతున్న కారులోనే తుపాకీతో కట్టుకున్న భార్యను, మరదలును కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పాలిగంజ్ డీఎస్పీ మనోజ్ కుమార్ పాండే వివరాల ప్రకారం.. 33 ఏళ్ల విష్ణు కుమార్ గుజరాత్‌లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య దామిని శర్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం విష్ణుకుమార్‌కు డెంగ్యూ సోకింది. అప్పటి నుంచి విష్ణు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో విష్ణుకు పట్నాలో చికిత్స చేయించడానికి తమ సొంత ఊరైన అరా నుంచి కారులో బయలుదేరారు. కారులో విష్ణుతో పాటు అతని భార్య, మరదలు డింపుల్ శర్మ, ఇద్దరు పిల్లలతో పాటు విష్ణు తండ్రి కూడా ఉన్నారు. డైవర్ పక్క సీటులో ఇద్దరు పిల్లలు వారి తాతయ్యతో కలిసి కూర్చోగా, వెనుక సీటులో విష్ణు, అతని భార్య, మరదలు కూర్చున్నారు.
ఈ సందర్భంగా విష్ణు, దామినిల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోవంతో విచక్షణ కోల్పోయిన విష్ణు తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య దామిని, మరదలు డింపుల్‌ను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడని మనోజ్ వెల్లడించారు. విష్ణు తండ్రి అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. విష్ణు కాల్చిన తుపాకీతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విష్ణు వాడిన తుపాకీ లైసెన్స్ కలిగి ఉందని నిర్థారించారు.
Comments
Please login to add a commentAdd a comment