
సత్యనారాయణ మృతదేహం , నాగవెంకట సత్యనారాయణ( ఫైల్)
విశాఖపట్నం,ఎస్.రాయవరం(పాయకరావుపేట): దేశ ప్రజలకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేసిన ఓ యువకుడు బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. తమ కళ్లముందు కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. చిన్న చెల్లి ఇంట్లో శుభాకార్యానికి వచ్చిన వారానికే ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో రామయ్యపట్నం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మీలో జవానుగా పనిచేస్తున్న నేదూరి నాగవెంకటసత్యనారాయణ (25) మంగళవారం తెల్లవారు జామున ఇంటివద్ద పురుగు మందుతాగాడు. గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించారు.
అయినా ఫలితం లేకపోయింది. ఇతను నాలుగున్నర ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి, అహ్మదాబాద్‌లో సిఫాయిగా పని చేస్తున్నాడు. చిన్న చెల్లి ఇంట్లో శుభకార్యానికి నెలరోజుల సెలవుపై వచ్చాడు. ఈ నెల 21న వచ్చిన నాగవెంకటసత్యనారాయణ బుధవారం చెల్లి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి అవసరమైన సరుకులు ,వస్తువులు కొనుగోలు చేశాడు. ఇంతలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న నాగవెంకటసత్యనారాయణకు పిల్లలు పుట్టక పోవడంవల్ల మనస్తాపానికి గురయ్యేవాడని, ఆ కారణం తప్ప ఆ యువకుడు చనిపోవడానికి మరో కారణం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. నాగవెంకట సత్యనారాయణ అంత్యక్రియలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కుమార్ స్వామి తెలిపారు.