
కొడవలిపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్‌రెడ్డి....
అత్తాపూర్: పాత కక్ష్యలను మనసులో పెట్టుకొని తమ్ముడిపై అన్న కొడవలితో దాడిచేసిన సంఘటన రాజేంద్రనరగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో అన్నదమ్ములు సామ సుభాష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలు నివసిస్తున్నారు. సుభాష్‌రెడ్డి వ్యాపారం చేస్తుండగా, చంద్రశేఖర్‌రెడ్డి లాయర్‌గా పనిచేస్తున్నాడు. తగ కొంత కాలంగా ఇద్దరికి ఆస్తుల లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో గొడవలు పడి ఒకరిపై ఒకరు రాజేంద్రనగర్ పీఎస్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం మధ్యాహ్నం వాంబేకాలనీ సమీపంలో నీటి సరఫరా జరిగే పైపులైన్ మరమ్మతుల విషయమై సామ సుభాష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో సుభాస్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న గడ్డి కోసే కొడవలితో తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు తీవ్ర గాయాలకు గురైన చంద్రశేఖర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తనపై సుభాష్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకు దాడి చేశారని చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుభాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.