సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆరోగ్యశ్రీ పర‍్మిషన్ పేరుతో తనను మోసం చేశారంటూ డాక్టర్ చక్రవర్తి బుధవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. డాక్టర్ చక్రవర్తికి చెందిన మేఘనా ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తామంటూ విజయలక్ష్మి నాలుగు లక్షలు వసూలు చేశారు. అయితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయలేదు. తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినా బెదిరింపులకు దిగారు. దీంతో విజయలక్ష్మితో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాదుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
కాగా కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment