జడ్చర్ల: ఫేస్‌బుక్ కపట ప్రేమ మరోసారి పడగవిప్పింది. గుర్తు తెలియని వ్యక్తితో చేసిన చాటింగ్ ముదిరి.. జస్ట్ కలుద్దామని పిలవగానే వెళ్లడం ఓ అమ్మాయిని నిర్జీవంగా మార్చేసింది. పాలమూరు జిల్లా జడ్చర్ల శివారులో రెండ్రోజుల క్రితం జరిగిన దారుణ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల వాసులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రవిశంకర్, సురేఖ దంపతులకు ఇద్దరు కూతుళ్లు శ్రీ హర్షిణి, శ్రీమాన్విత. జిల్లా కేంద్రం సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో శ్రీహర్షిణి (15) పదో తరగతి, శ్రీమాన్విత ఆరోతరగతి చదువుతున్నారు. తండ్రి రవిశంకర్ జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన రవిశంకర్ కుటుంబం 25 ఏళ్ల క్రితమే జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో స్థిరపడింది.
దుకాణానికి వెళ్లి
హౌసింగ్‌బోర్డు కాలనీలోని తమ నివాసం నుంచి శ్రీహర్షిణి మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెన్ను, పెన్సిల్ కొనేందుకు జడ్చర్ల–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన శ్రీహర్షిణి.. వెంటనే మళ్లీ ఏదో కొనాలని చెప్పి రోడ్డుపైకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. దాదాపు గంటపాటు ఎదురుచూసిన తల్లి సురేఖ.. కూతురు ఇంటికి రాలేదంటూ భర్త రవిశంకర్‌కు ఫోన్ చేసింది. రవిశంకర్ వెంటనే ఇంటికొచ్చి చుట్టుపక్కల వారిని శ్రీహర్షిణి గురించి అడిగారు. ఆమెకు ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఎత్తలేదు. రాత్రి 7గంటల తరువాత ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి వెంటనే దర్యాప్తు చేపట్టారు.
కారులో ఎక్కి వెళ్లిందన్న సమాచారంతో..
హౌసింగ్‌బోర్టు సమీపంలో ఓ కారులో శ్రీహర్షిణి ఎక్కి వెళ్లిందని.. తెలిసిన వారైనందునే ఆ కారులో వెళ్లి ఉంటుందని భావించినట్లు కొందరు స్థానికులు పోలీసులకు చెప్పారు. ఆ కారు గుర్తులు అడిగి తెలుసుకుని సీసీ కెమెరాల పుటేజీలని పరిశీలించారు. బాలానగర్ సమీపంలోని టోల్‌ప్లాజా దగ్గర జడ్చర్ల వైపు వచ్చి కేవలం అరగంటలోపే మళ్లీ హైదరాబాద్ వైపు ఆ కారు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారు నంబరును సేకరించి రవాణా శాఖ అధికారుల సహకారంతో కారు యజమాని చిరునామాను సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు.
నిందితుడి పట్టివేత
ఈ మేరకు కారు యజమాని తన కారును తీసుకెళ్లిన యువకుడి సమాచారం పోలీసులకు ఇవ్వడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ మండలం కోహెడకి చెందిన ఏనుగు నవీన్‌రెడ్డి (28)ని పోలీసులు అరెస్ట్ చేసి జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు హైదరాబాద్‌లోని వీల్ అలైన్‌మెంట్ దుకాణంలో మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నవీన్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన సమాచారంతోనే శ్రీహర్షిణి హత్య వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారించగా.. గురువారం తెల్లవారుజామున శ్రీహర్షిణిని చంపేసినట్లు చెప్పాడు. ఈ సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు శ్రీహర్షిణి మృతదేహాన్ని గుర్తించారు. జడ్చర్ల శివారులోని శంకరాయపల్లితండాకు వెళ్లే రహదారికి కొద్దిదూరంలో ఉన్న గుట్ట పక్కన గడ్డిపొదల మాటున మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే!
పెద్దగా చదువుకోని నవీన్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో జడ్చర్లకు చెందిన శ్రీహర్షిణితో మూడు నెలలుగా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు. వీరిస్నేహం కాస్త ముదరడంతో తరచూ వాట్సప్, ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేసుకునేవారని సమాచారం. కొంతచనువు ఏర్పడడంతో నవీన్‌రెడ్డి మంగళవారం కారులో జడ్చర్లకు వచ్చి శ్రీహర్షిణి కలిశాడు. హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలోనే ప్రధాన రహదారిపైకి వచ్చిన శ్రీ హర్షిణిని నవీన్‌రెడ్డి కారులో ఎక్కించుకుని శంకరయాపల్లి తండా రహదారి వైపు వెళ్లారు. అక్కడ నిర్జన ప్రదేశంలో వారు కాసేపు మాట్లాడిన తరువాత శారీరకంగా తనతో కలవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో తనకు ఇష్టంలేదని, తనను వదిలేయాలని శ్రీ హర్షిణి చెప్పింది. వెంటనే అక్కడి నుంచి పరుగెత్తే క్రమంలో నవీన్‌రెడ్డి శ్రీహర్షిణి డ్రెస్సును పట్టి లాగడంతో దుస్తులు చిరిగిపోయాయి. ఈ క్రమంలో శ్రీహర్షిణిని గట్టిగా వెనక్కి నెట్టడంతో ఆమె కింద పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న బండరాయిని తలపై పడేసిన నవీన్‌రెడ్డి వెంటనే కారులో హైదరాబాద్‌కి వెళ్లిపోయాడు.
ఉరిశిక్ష విధించాలి
విద్యార్థినిని దారుణంగా హత్యచేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని విద్యార్థి, మహిళా సంఘాలు, యువకులు, రాజకీయ నాయకులు ఆందోళనకు దిగారు. జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు ఎదుట జడ్చర్ల–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వరంగల్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష అమలు చేశారో అదే ఉరిశిక్షను ఇక్కడి హంతకుడు నవీన్‌రెడ్డికి విధించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment