సినీ నటుడు ఉదయ్ కిరణ్ నండూరి
బంజారాహిల్స్: తప్పుడు పత్రాలతో ఇంటి కిరాయి అగ్రిమెంట్ చేసుకోవడమేగాక ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్న సినీ నటుడు ఉదయ్ కిరణ్ నండూరి(ఫేస్‌బుక్ హీరో)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్‌పేట్‌కు చెందిన శివ ప్రసాద్ కలాని అనే వ్యాపారికి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 59లోని నందగిరిహిల్స్ ఆదిత్యహిల్స్‌లో ఫ్లాట్ ఉంది. ఈ నెల 23న ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకునేందుకు సినీ నటుడు ఉదయ్ కిరణ్ నండూరి తప్పుడు గుర్తింపు పత్రాలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అగ్రిమెంట్ అనంతరం ఉదయ్ కిరణ్‌కు సంబంధించిన వివరాల కోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయగా డ్రగ్స్, కారు దొంగతనం కేసుల్లో పీడీయాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించాడు.
దీంతో ఆయన ఉదయ్ కిరణ్‌కు ఫోన్ చేసి తాను ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వడం లేదని చెప్పగా, అయితే అప్పటికే లగేజీతో సహా ప్లాట్ వద్దకు వచ్చిన ఉదయ్‌కిరణ్ వాచ్‌మెన్ వద్ద తాళంచెవులు తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో వాచ్‌మెన్‌ను తోసేసి ఫ్లాట్‌లోకి వెళ్ళడమే కాకుండా తననే ఫ్లాట్ ఖాళీ చేయమంటావా అంటూ 20 మంది గూండాలతో కలిసి యజమాని శివప్రసాద్ కలానిని బెదిరించాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఖాళీ చేయబోనని హెచ్చరించారు. దుబాయ్‌లో ఉండే ఎన్‌ఆర్‌ఐ మంగీలాల్ కలారికి చెందిన ఈ ఫ్లాట్ వ్యవహారాలను తానే చూస్తుంటానని అక్రమంగా ఫ్లాట్‌లోకి చొరబడ్డ ఉదయ్‌కిరణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment