
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన మాజీ మంత్రి డీకే శివకుమార్ తానే సమస్యల్లో పడిపోయారు. పార్టీకి అనేక ఆపరేషన్లలో వెన్నుదన్నుగా ఉంటూ కీలక నేతగా చక్రం తిప్పుతున్న డీకేశితో పాటు కాంగ్రెస్‌పార్టీకి షాక్ తగిలింది. అక్రమ నగదు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను ఢిల్లీలో అరెస్టు చేశారు. గత శుక్రవారం ప్రారంభమైన విచారణ ఆదివారం మినహా మంగళవారం వరకు కొనసాగింది. సుమారు 29 గంటల పాటు డీకేశిని ఈడీ విచారించింది. విచారణలో డీకే సహకరించలేదని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం ఐటీ దాడుల్లో ఢిల్లీలోని ఆయన నివాసంలో రూ. 8.59 కోట్ల నగదు లభించడంతో డీకేశిపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ డీకేను విచారణ చేస్తూ వస్తోంది. ఢిల్లీలో ఈడీ ఆఫీసులో మధ్యాహ్న 12 గంటలకు ప్రారంభమైన డీకేశి విచారణ రాత్రి 8.30 గంటలసమయంలో అరెస్టుతో ముగిసింది. నాలుగురోజుల నుంచి ఆయనను ఈడీ విచారిస్తుండడం తెలిసిందే.
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యే ముందు డీకే శివకుమార్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుంచి విచారణకు హాజరవుతున్నట్లు, ఇంకా ఎన్ని రోజులు రావాలో తెలియదన్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. డీకేశి అరెస్టు వార్తలను టీవీలో చూసిన ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈడీ ప్రధాన కార్యాలయం లోకనాయక భవనం ఎదుట ఆందోళనకు దిగారు. డీకేశి అరెస్టు నేపథ్యంలో బెంగళూరుతో పాటు మండ్య, హాసన్ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గొడవలు జరగకుండా నిఘా వేసింది. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది.