సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కింద సోమవారం అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నామని అధికారులు మంగళవారం తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది.
రతుల్ పురిపై రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలున్నాయి. మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సమయంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారని అభియోగం. ఈ కేసులో ఆయనతో పాటు మోసర్ బేర్ సంస్థకు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇందులో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పురి, డైరెక్టర్స్ నీతా పురి, సంజయ్ జైన్, వినీత్ శర్మ ఉన్నారు.ఇదే కేసుకు సంబంధించి సీబీఐ ఆదివారం,సోమవారం ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రతుల్ పూరి 2012 లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయగా, అతని తల్లిదండ్రులు బోర్డులో కొనసాగుతున్నారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు రతుల్ పురి ఆరెస్ట్ దురదృష్టకరమని మోసర్ బేర్ ప్రకటించింది. తాము చట్టపరమైన అన్ని నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) లో ఉండగా తాజా కేసు ఉద్దేశపూర్వంగా నమోదు చేశారని ఆరోపించింది.
కాగా కాంపాక్ట్ డిస్క్‌లు, డివిడిలు, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ పరికరాల వంటి ఆప్టికల్ స్టోరేజ్ మీడియా తయారీలో కంపెనీ మోజర్ బేర్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఈ సంస్థ మూతపడింది. రతుల్ పురిపై అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ముడుపులు మోసర్ బేర్ సంస్థ ద్వారానే చేతులు మారాయని విచారణలో తేలింది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment