నీళ్లలో గల్లంతైన భార్యా భర్తలు రామాంజనేయులు, పెంచలమ్మ (ఫైల్)
ప్రొద్దుటూరు క్రైం : నీళ్లలో గల్లంతై 16 రోజులైంది. అయినా వారి జాడ ఇంత వరకూ తెలియలేదు. రాత్రింబవళ్లు వంకలు, వాగులు, కుందూ నదిలో వెతికినా వారి ఆచూకీ లభించలేదు. ఈ నెల 16న ఎర్రగుంట్ల మండలం, పోట్లదుర్తి దళిత వాడకు చెందిన ముల్లుగాళ్ల రామాంజనేయులు, భార్య పెంచలమ్మ, తల్లి సుబ్బమ్మతో పాటు కుమార్తెలు అంజలి, మేఘన, 10 నెలల బాబు కామనూరు వంకలోని నీళ్లలో గల్లంతైన విషయం తెలిసిందే. వీరు శుభకార్యం నిమిత్తం దువ్వూరు మండలంలోని గొల్లపల్లెకు వెళ్లి రాత్రి ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా 12 గంటల సమయంలో నీటి ఉధృతికి ఆటో బోల్తా పడి ఈ దుర్ఘటన జరిగింది. ముందుగా భార్యాభర్తలు, బాలిక మాత్రమే నీళ్లలో కొట్టుకొని పోయారని అందరూ భావించారు. అయితే రెండు రోజుల తర్వాత పోట్లదుర్తి గ్రామానికి చెందిన వారి బంధువులు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఆరుగురు గల్లంతైన విషయం బయటపడింది. కుందూ నది పక్కనే ఉన్న కామనూరు వంకలో వరద నీటి ఉధృతి కారణంగా గాలింపునకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో నీటి ప్రవాహం తగ్గడంతో అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. వంక దిగువ ప్రాంతంలోని మాచనపల్లె రహదారిలో గత నెల 19వ తేదీన ఉదయం సుబ్బమ్మ, అంజలి, మేఘన మృతదేహాలను గుర్తించారు. ముళ్ల పొదల్లో చిక్కుకొని ఉండగా రెస్క్యూ సిబ్బంది బయటికి తీశారు. అదే రోజు రాత్రి మళ్లీ వర్షం పడటంతో కుందూ నదిలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో మిగతా వారిని గాలించడానికి సాధ్యం కాలేదు.
16 రోజులైనా జాడలేదు..
నాలుగైదు రోజుల నుంచి వర్షాలు పడకపోవడంతో కుందూ నదిలో నీటి ఉధృతి తగ్గింది. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు నిలిపేసినా దిగువన ఉన్న చాపాడు, ఖాజీపేట, వల్లూరు మండలాల పోలీసులు, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా 16 రోజులైనా రామాంజనేయులు, పెంచలమ్మ, పసికందు ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వారు పోలీసులను కలిసి, త్వరగా తమ వారి ఆచూకీ కనుగొనాలని కోరారు. కామనూరు వంకలో గల్లంతైన ముగ్గురి కోసం ఇప్పటికీ గాలిస్తున్నామని ప్రొద్దుటూరు రూరల్ సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. వారి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment